– కేంద్రమంత్రి సోమన్న
– జమ్మికుంట కేవీకే ‘పీఎం కిసాన్’ కార్యక్రమానికి హాజరు
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూన్ 18
రైతు సంక్షేమమే లక్ష్యంగా నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర కేంద్ర జలశక్తి, రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్న తెలిపారు. మంగళవారం ఆయన ‘పీఎం కిసాన్ సమ్మాన్’ నిధి కింద మొదటి విడతగా రిలీజ్ చేసే కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) జమ్మికుంటలో ప్రత్యక్షంగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019 ఫిబ్రవరిలో ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో మోడీ ప్రారంభించారని గుర్తుచేశారు. ఈ స్కీమ్ ద్వారా మూడు విడతల్లో రూ.2,000 చొప్పున కేంద్రం..సంవత్సరానికి రూ.6,000 సాయంగా అందిస్తూ నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందని తెలిపారు. ఈ పథకంలో భాగంగా 17 వ విడతలో 9.26 కోట్ల మంది రైతులకు సుమారు 20,000 కోట్ల రూపాయలు జమ చేసినట్టు వివరించారు. అదే విధంగా వ్యవసాయ పద్ధతులలో తోటి రైతులకు సహకరించడానికి పారా-ఎక్స్‌టెన్షన్ వర్కర్లుగా పనిచేయడానికి ‘కృషి సఖి’లుగా శిక్షణ పొందిన 30,000 మందికి పైగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రధాని మోడీ సర్టిఫికేట్లను అందజేస్తున్నట్టు వెల్లడించారు.
వ్యవసాయ సాంకేతిక అనుప్రయోగ పరిశోధన సంస్థ జోన్ అధికారి డా.షేఖ్ ఎన్ మీరా మాట్లాడుతూ భారత్‌లో అత్యధికంగా సుమారు 80% చిన్న, సన్న కారు రైతులు ఉన్నారని, వారికి ఆర్థికంగా చేయూతని ఇవ్వడానికి ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. వ్యవసాయంలో అగ్రి డ్రోన్ల మిద 85% సబ్సిడీ ఇస్తూ అందులో మహిళలకు ప్రాధాన్యతను ఇస్తూ వారికి శిక్షణ ను ఇచ్చే ఏర్పాటు చేస్తోందని చెప్పారు. దీనిని రైతులు తప్పకుండా సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. హుజురాబాద్ శాసన సభ సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను రైతులు పెట్టుబడి గా ఉపయోగించుకోవాలని తెలిపారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. అలాగే ఈ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల ద్వారా తగిన శాస్త్రీయ సాంకేతిక సలహాలు పొందుతూ వ్యవసాయ రంగం లో రాణించాలని రైతులను కోరారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట ప్రధాన కార్యదర్శి పరిపాటి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ రైతును రక్షించేందుకు, వారి కుటుంబానికి భరోసా ఇవ్వడం కోసం రైతులకు భీమా ను కల్పించాలని కేంద్రమంత్రిని కోరారు. అలాగే ప్రస్తుతం వ్యవసాయంలో రైతులు నేల ఆరోగ్యం పై అధికం గా దృష్టి పెట్టాలని నేల ఆరోగ్యమే మానవ మనుగడకు అవసరం అని తెలిపారు.కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ , హెడ్ డా.ఎన్ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ ఈ పథకం కింద రాష్ట్రంలో సుమారు 29.50 లక్షల మంది రైతులు 590 కోట్ల రూపాయలతో లబ్ది పొందగా, అందులో కరీంనగర్ జిల్లా పరిధిలో 90515 మంది రైతులు 18.1 కోట్ల రూపాయలు పొందారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, హుజురాబాద్ ఆర్డీవో, కృషి విజ్ఞాన కేంద్రం సిబ్బంది, ఆదర్శ రైతులు, వ్యవసాయ, అనుబంధ సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.