అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ తో రైతులకు ఎంతో ప్రయోజనం

 

జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి సెప్టెంబర్ 16 (ప్రజాబలం) కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు రైతుల కోసం ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి కలెక్టర్ ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎకరం,రెండు ,మూడు ఎకరాలతో పాటు ఒక సెంటు భూమి ఉన్న రైతులు సైతం లక్ష రూపాయల వరకు ఆదాయం పొందడం ఎలా అనేది ఈ ఎగ్జిబిషన్ ద్వారా అవగాహన కల్పిస్తారని తెలిపారు. రైతులు ఎన్ని పనులు ఉన్నా ఈ ఎగ్జిబిషన్ ను తిలకించి అవగాహన పొందాలని సూచించారు. అగ్రికల్చర్,హార్టికల్చర్, డిఆర్డిఏ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ఎంతో ఆకర్షణగా నిలిచాయని, అధికారులు సైతం అన్ని అంశాలను రైతులకు కూలంకషంగా వివరిస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధిలోకి తేవడమే లక్ష్యంగా జిల్లాలో సరికొత్త విధానాలను ప్రవేశపెడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. వ్యవసాయం చేయడానికి జిల్లాలో అన్ని రకాల వనరులు రైతులకు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని అన్నారు. హైదరాబాద్,ఢిల్లీ వంటి మహానగరాలలో ఈ స్టాల్స్ ఇంతకుముందు ఏర్పాటు చేసే వారని, జిల్లా రైతుల కోసం తొలిసారి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెండు రోజులపాటు నిర్వహించే అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ కు రైతులు హాజరై పూర్తి అంశాలపై అవగాహన పొంది వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబించాలని తెలిపారు. అనంతరం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ జిల్లా రైతాంగానికి అవసరమైన అనేక అంశాలు ఈ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చోరవతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కోసం జిల్లా రైతులకు కావలసిన అన్ని వనరులను చేకూరుస్తున్నారని చెప్పారు. వ్యవసాయ రంగంలో ఎన్ని రకాల కొత్త పోకడలు ఉంటాయనేది ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలిసిందని ఎమ్మెల్యే చెప్పారు. స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి రైతులను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపడుతున్నారన్నారు. ఆయిల్ ఫామ్ తో పాటు ఇతర పంటలను సాగు చేసేందుకు రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. ఇలాంటి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ను జిల్లాలో తొలిసారిగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ ను అభినందించారు. రైతులు తక్కువ ఆదాయంతో పంటలను సాగుచేసి, ఎక్కువ ఆదాయం పొందే విధానాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ శాస్తవ్రేత్తలు, రైతులు,వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking