ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ అక్టోబర్ 09 : మత్స్యకారుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులతో అమలుపరుస్తున్న సబ్సిడీ పథకాలను తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారులందరూ వినియోగించుకోవాలని తద్వారా ఆర్థిక స్వావలంబన సాధించే దిశలో అడుగులు వేయాలని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ మరి మాజీ చైర్మన్ మరియు తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి గ్రామంలో స్థానిక ప్రాథమిక మత్స్య సహకార సంఘాల ప్రతినిధులు మరియు మహిళా మత్స్య సహకార సంఘాల ప్రతినిధుల సంయుక్త సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సమావేశంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యులు పిట్టల తిరుపతి ముదిరాజ్,ప్రకృతి పర్యావరణ సంస్థ జిల్లా సమన్వయకర్త తాళ్లపల్లి కిరణ్ కుమార్,రాష్ట్ర ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి దేవేందర్,మత్స్య సహకార సంఘం అధ్యక్షులు వెంకటేష్ తదితరులు కూడా పాల్గొన్నారు.కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయల భారీ నిధులతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నదని ఈ పథకంలో మహిళ లబ్ధిదారులకు 60 శాతం సబ్సిడీ మరియు పురుష మత్స్యకారులకు 40 శాతం సబ్సిడీతో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయని వీటిని మత్స్య సహకార సంఘాలలో సభ్యులుగా కొనసాగుతున్న మత్స్యకారులు అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో గ్రామస్థాయి హత్య సహకార సంఘాలు చొరవ చూపాలని పిట్టల రవీందర్ సూచించారు. మత్స్యకారులు కేవలం చెరువుల్లో చేపలు పెంచడానికి మాత్రమే పరిమితం కాకుండా చేపల ఆహారాన్ని వివిధ రూపాలలో మార్కెట్కు, వినియోగదారులకు పరిశుభ్రమైన పద్ధతిలో అందే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆర్థిక పరిపుష్టిని సాధించాలని ఆయన సూచించారు.చేపల వ్యర్ధాల నుండి సేంద్రియ ఎరువులను పురుగుల మందులను తయారు చేసే ఆధునిక ప్రక్రియను ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు. స్థానిక మత్స్యకారులు చేపలు పెంచుతున్న స్థానిక గ్రామ చెరువును సందర్శించిన పిట్టల రవీందర్ చెరువుల్లో చేపల ఉత్పాదకతను పెంచేందుకు తీసుకోవలసిన చర్యలపై మత్స్యకారులకు పలు సూచనలు అందించారు.పాత కొమ్ముగూడెం గ్రామంలో జనార్ధన్ అనే మత్స్యకారుడు నిర్వహిస్తున్న బ్యాక్యార్డ్ ఫిషరీస్ యూనిట్ను ఈ సందర్భంగా సందర్శించారు.