ముంపు నివారణకు శాశ్వత ప్రాతిపదికన ప్రణాళికలు సిద్దం చేయాలి

పంచాయితీరాజ్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి.

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా 13 జూన్ 2024 : వర్షాకాలంలో అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలి. మంచి నీరు కలుషితం కాకుండా చూడాలి. సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలి.

వ్యాధుల నియంత్రణకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులు అప్రమత్తంగా ఉండాలి.

ములుగు జిల్లా లో భవిష్యత్తులో ముంపునకు గురి కాకుండా శాశ్వత ప్రాతిపదికన ప్రణాళికలను రూపొందించాలని పంచాయితీరాజ్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పి షభరిష్, ఐటిడిఏ పీ. ఓ. చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్లు పి. శ్రీజ, సి హెచ్ మహేందర్ జి, ఏ ఎస్పి ఏటూరు నాగారం మహేష్ బి గితే, డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్ లతో కలిసి వరద సంసిద్ధత, వరద ముంపు నివారణకు చర్యలు, అభివృద్ధి పనులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో పంచాయితీరాజ్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క కూలంకశంగా సమీక్షించి సమర్థ నిర్వహణకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేసవి కాలం లో గ్రామాలలో ప్రజలకు త్రాగునీరు అందించడానికి అధికారులు, సిబ్బంది చేసిన కృషిని అభినందించారు. వర్షకాలంలో భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో గతంలో జిల్లా లో ముంపునకు గురై ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారో అలాంటి సమస్య తిరిగి పునరావృతం కాకుండా చూడాలని, ఎన్నికల నేపధ్యం లో మూడు నెలల సమయం వృధాగా పోయిందని, వర్షాకాల సందర్భం గా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వరదలు సంభవించే క్రమం లో ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని, మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నీరు నిల్వ ఉండకుండా ఏదో ఒక మార్గం గుండా బయటకు వెల్లిపోయేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. వచ్చే వరద నీటిని దారి మళ్ళించే విధంగా సాంకేతికంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆయా విభాగాల ఉన్నతాధికారుల తో సంప్రదించాలని అన్నారు. జిల్లాలో వరదల నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని ప్రభుత్వం నుండి నిధులను తీసుకురావడాని కృషి చేస్తానని మంత్రి తెలిపారు.
ప్రత్యేక అధికారులు గ్రామాలలో పర్యటిస్తూ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. పనులలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వరదల సమయంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వర్షా కాలంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అధికారులు సిద్ధం చేసే ప్రణాళికలు,అంచనా పనులు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఉండాలని అన్నారు.
వర్షాకాలం లో త్రాగునీరు కలుషితం కాకుండా అధికారులు జాగ్రత్త తీసుకోవాలన్నారు.

వైద్యాధికారులు వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మారుమూల మండలాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిందిగా, సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధుల పై ప్రజలకు అవగాహన కల్పించాలని, వ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి విష జ్వరాలు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మాతా శిశు మరణాలు, చిన్నపిల్లల్లో వచ్చే రక్తహీనత సమస్యలు, టీబి, అంటు వ్యాధుల నిర్మూలన కార్యక్రమాలు జరిగే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను మంత్రి అధికారంలో అడిగి తెలుసుకుని, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించి పనులు పూర్తి కాకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయని దృష్టికి వచ్చాయని పనులు వెంటనే పూర్తి చేయాలని లేకుంటే కాంట్రాక్టర్ లను తొలగించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం నేపద్యం లో గ్రామాలలో ఫీవర్ సర్వే నిర్వహించాలని ,స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత లేకుండా చూసుకోవాలని ,ఐటిడిఏ ఏటూరు నాగారం కార్యాలయం లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, వరదల సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అన్నారు.

రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని వరద ముంపునకు గురికాకుండా ఏలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో, గతం లో 2023 సం.లో వరద ముంపును ఎదుర్కొనడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం జరిగిందో పవార్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, ఇరిగేషన్, నేషనల్ హై వే, పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, ఎలక్ట్రిసిటీ, ఇంజనీరింగ్ అధికారులు,9 మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎం పి డి ఓ లు, వైద్యాధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking