కార్బైడ్ రహిత పండ్ల విక్రయాలకు జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి
గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్, మార్చి 12: రానున్న మామిడి పండ్ల సీజన్ ను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారుల సూచనల మేరకు మోజాం జాహీ మార్కెట్ లో బుధవారం పండ్ల విక్రయదారులు పండ్ల పక్వానికి నిషేదిత కార్బైన్ ను ఉపయోగిస్తున్నారా అన్న అంశాన్ని పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, డిజిగ్నేటెడ్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ వాహనం, ల్యాబ్ టెక్నీషియన్ లు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, పోలీసు టాస్క్ ఫోర్స్ బృందం పాల్గొన్నారు.
ఎం.జె మార్కెట్ లోని బాలాజీ ఫ్రూట్ మర్చెంట్, కాశ్మీర్ ఫ్రూట్ హౌస్, ఎన్.ఎస్.బి ఫ్రూట్ హౌస్, మదీనా ఫ్రూట్ హౌస్, క్రిస్పీ ఫ్రూట్ హౌస్ లను తనిఖీ చేశారు. తనిఖీల అనంతరం మోజాం జాహీ మార్కెట్ లోని పండ్ల వ్యాపారులకు కార్బైడ్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, పండ్ల పక్వానికి తెలంగాణ ఆహార భద్రత కమిషనర్ సూచనలను పాటించాలని, అదేవిధంగా అనుమతించిన పదార్థాలను మాత్రమే పండ్ల పక్వానికి వినియోగించాలని అవగాహన కల్పించారు. ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006 ప్రకారం పండ్లను పండించే పద్దతులను అనుసరించాలని అవగాహన కల్పించారు.