– మ్యాన్ హోల్ పూడ్చివేత..స్కూల్ ఆవరణలో చెత్తా చెదారం చదును
– ‘ప్రజాబలం’ తెలుగు దినపత్రిక కథనానికి స్పందన
– పరిసరాలను పరిశుభ్రంగా మారడంతో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రుల సంతోషం
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి,జూన్ 25
‘సమస్యల వలయంలో శాయంపేట యూపీఎస్’ శీర్షికన ‘‘ప్రజాబలం’’ తెలుగు దినపత్రిక మంగళవారం ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. జమ్మికుంట మండల పరిధిలోని శాయంపేట గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల సమస్యల వలయంలో చిక్కుకున్న సంగతి ‘ప్రజాబలం’ తెలుగు దినపత్రిక తన కథనంతో వెలుగులోకి తీసుకొచ్చింది. స్కూల్ కు కనీసంగా స్కూల్ బోర్డు కూడా లేని దుస్థితి నెలకొందని కథనంలో ప్రస్తావించింది. విద్యకు నిలయంగా ఉండే పాఠశాలలో బీరు బాటిళ్లు దర్శనమిస్తున్నాయని, అపరిశుభ్రతకు ఆలవాలంగా పాఠశాల పరిసరాలు ఉన్నాయని వెల్లడించింది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా పాఠశాల మారిందనే విషయాన్ని వెల్లడించింది. అపరిశుభ్ర పరిసరాల వల్ల స్టూడెంట్స్ కు ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో స్పందించిన జీపీ అధికారులు సిబ్బంది చేత పనులు చేయించారు. ట్రాక్టర్ (బ్లేడ్ బండి) చేత పాఠశాల ఆవరణలో చదును చేయించారు. పరిసరాల పరిశుభ్రత వల్ల పాములు, తేళ్లు, ఇతర కీటకాల వల్ల చిన్నారులు, విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందని గుర్తించిన ఆఫీసర్లు పరిసరాలను క్లీన్ చేయించారు. ప్రాథమికోన్నత పాఠశాలలో పనులు జరిగాయి. దాంతో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.