జిల్లాలో సుమారు 2975 గణేష్ విగ్రహాల ఏర్పాటు
మండపాలన్నింటికి జియో ట్యాగ్.
పెట్రోలింగ్ తో నిరంతర పర్యవేక్షణ
జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.
ప్రజాబలం దినపత్రిక – మెదక్ జిల్లా ప్రతినిధి
14.09.2024:
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ.. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, వినాయక మండపాలు వద్ద అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని అన్నారు. గణేష్ మండపాల అనుమతులను ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే సూచించినామని అందుకు అనుగుణంగా ప్రతి మండపం యొక్క సమగ్ర సమాచారాన్ని ఒక్క క్లిక్ తో అందుబాటులోకి తీసుకువచ్చేలా పరిజ్ఞానాన్ని వాడుతున్నామని జిల్లా వ్యాప్తంగా 2975 వరకు ఈ సంవత్సరం వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. వీటన్నింటికి ఇప్పటికే జియో ట్యాగ్ చేయటం జరిగింది. జియో ట్యాగ్ చేసిన మండపాలను క్లిక్ చేస్తే మండపానికి సంబందించిన పూర్తి వివరాలు అందులో కనిపించేలా చర్యలు చేపట్టారు అంతే కాదు ఆ మండపం వద్దకు ఎలా వెళ్లాలి, ఏదైనా జరిగినప్పుడు త్వరగా ఆ ప్రాంతానికి చేరుకోవాలి అనేది సైతం మ్యాప్ తో సహా కనిపించే విధంగా గూగుల్ మ్యాప్ తో యాప్ ను అనుసంధానించారు . ఏ మండపం వద్దనైనా ఘర్షణ జరిగినట్లుగా సమాచారం వస్తే ఆ మండపం అడ్రస్ వెతకావాల్సిన అవసరం లేకుండా జియో ట్యాగింగ్ ద్వారా కేవలం 5 నుండి 10 నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఫూట్ పెట్రోలింగ్, పెట్రోలింగ్ వాహనాలతో నిరంతర పర్యవేక్షణ
జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ ల పెట్రోలింగ్ వాహనాలు, బ్లూ కోట్స్ వాహనాలతో రాత్రి, పగలు గణేష్ మండపాలతో పాటు అన్ని ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నామని ఎస్పీ వివరించారు. జిల్లాలో నవరాత్రుల సందర్బంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రతి మండపం వద్ద విధిగా సిసి కెమెరాలు అమర్చుకునే విధంగా మండపాల నిర్వాహకులలో అవగాహన కల్పించామని అన్నారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని, గణేష్ నవరాత్రులు, నిమజ్జనం నిర్వహించుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల సంచారం లాంటి సమాచారాన్ని బాధ్యత కలిగిన పౌరులుగా పోలీసులకు తెలియపర్చాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు.