ఖమ్మం ప్రతినిధి జూన్ 17 (ప్రజాబలం) ఖమ్మం మధిర నియోజకవర్గం ప్రభుత్వంలో పారదర్శకత, సామర్ధ్యాన్ని పెంచడంతో పాటు, భూమి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఆస్తుల బదిలీలకు జవాబుదారితనం, సురక్షితమైన, ప్రజలకు ఇబ్బంది లేని సేవలు అందించడానికి ధరణి పోర్టల్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినారు. ధరణి పోర్టల్ లో ఖమ్మం జిల్లాలో భూ సంబంధిత విషయాల ప్రక్రియలో వేగవంతం, రైతుల భూ సమస్యలకు పరిష్కారం కలుగుతుంది. ధరణితో ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా వున్న భూ సమస్యలు పరిష్కరించబడుచున్నాయి. భూ రికార్డుల్లో పేర్లు నమోదు కాక, ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ ఫలాలు అందనటువంటి వారికి ధరణి పోర్టల్ రాకతో సమస్య పరిష్కారమై, ప్రభుత్వ ఫలాలు వారికి దక్కుతున్నాయి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెం గ్రామ సర్వేనెం.283, 284, 285, 286, 290, 291, 292 లు గ్రామ సముహి భూములు. అట్టి భూములను గత (50) సంవత్సరాలుగా గ్రామస్తులు ఎకరము/ఆర ఎకరము చొప్పున సాగు చేసుకుంటున్నారు. కాని అట్టి భూములకు రైతుల పేర్లు రెవెన్యూ రికార్డులో నమోదు చేయకపోవడం చేత, ఏ విధమైన టైటిల్ లేనందున ప్రభుత్వం నుండి రైతుబంధు, రైతుభీమా, ఋణమాఫీ తదితర లబ్ధి ఏమి ఈ రైతులు పొందడం లేదు. ఇట్టి విషయం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ దష్టికి రాగా, ఈ సమస్యను ‘‘బల్క్ ఇష్యూ’’లో చేర్చి ప్రతిపాదనలు సమర్పించవలసినదిగా ఆదేశించారు. అట్టి ఆదేశాల ప్రకారము (117) మంది రైతులకు 81.25 ఎకరాలకు అసైన్‌మెంట్ పట్టాలు మంజూరు చేసి వారందరి పేర్లు రెవెన్యూ రికార్డుల్లో చేర్చుట వలన, ప్రభుత్వం నుండి రైతుబంధు, రైతుభీమా, ఋణమాఫీ వంటి అన్ని లబ్ధి ఫలాలు పొందేందుకు వీలుకలిగినది. రైతులకు ఈ ధరణి పోర్టల్ ద్వారానే న్యాయం కలిగిందని, ధరణితోనే సాగులో వున్న భూములకు హక్కులు పొందగలిగామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాగే ఇదే ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం గ్రామంలో 1974 సంవత్సరములో (130) సభ్యులతో హరిజన /లంబాడ ఫామింగ్ కో ఆపరేటీవ్ సొసైటి ఏర్పాటు చేసియున్నారు. సొసైటీ సభ్యులు సమిష్టి వ్యవసాయం చేసుకొనుటకు గాను 150 ఎకరాలు అసైన్‌మెంట్ పట్టాను అప్పటి మధిర తహశీల్దారు ఇచ్చియున్నారు. కమిటి అట్టి భూమిని సభ్యులు 0.20 గుంటల చొప్పున పంచుకొని వ్యవసాయం చేస్తున్నారు. లబ్ధిదారుల పేర్లు రెవెన్యూ రికార్డుల యందు నమోదు కాకపోవడం చేత ప్రభుత్వం నుండి వచ్చే రైతుబంధు, రైతుభీమా, ఋణమాఫీ తదితర ఫలాలు లబ్ధి పొందలేకపోయారు. ఇట్టి విషయము జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ సమస్యను బల్క్ ఇష్యూగా గుర్తించి వెంటనే ప్రతిపాదనలు సమర్పించవలసినదిగా కలెక్టర్ ఆదేశించారు. 56 ఎకరాలకు గాను (123) మంది సొసైటీ సభ్యులకు అసైన్‌మెంట్ పట్టాలను మంజూరు చేయడం జరిగినది. లబ్ధిదారులకు ఈ-పాస్‌పుస్తకాలు వచ్చాయి. 50 సంవత్సరాల నుండి పెండింగ్ వున్న సమస్యకు ధరణి పోర్టల్‌తో పరిష్కారం లభించింది. రైతులు ఈ ధరణి ద్వారానే తమకు పట్టాలు వచ్చినట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఎర్రుపాలెం మండలం ఆయ్యవారిగూడెం, జమలాపురం గ్రామ రైతుల బల్క్ ఇష్యూను పరిష్కరించి రైతులకు భూమిహక్కు పత్రాలను తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా జూన్ 10న సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమలరాజుతో కలిసి అందజేశారు. ధరణి పోర్టల్‌తో భూ సమస్యకు మార్గం సుగుమమయి, అన్ని ప్రయోజనాలకు అర్హులు కావడంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.