ధాన్యం కొనుగోలు కేంద్రాలను , రైస్ మిల్లులను స్థానిక తహసిల్దార్ తో కలిసి సందర్శించిన మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేష్
మెదక్, మే 11, 2023 ప్రజా బలం న్యూస్ :-
హమాలీలను అధిక సంఖ్యలో పెట్టుకొని ధాన్యం వచ్చిన 24 గంటలలోగా దించుకొని ట్రక్ షీట్ అందజేయాలని అదనపు కలెక్టర్ రమేష్ రైస్ మిల్లర్లకు సూచించారు. శనివారం మనోహరాబాద్ మండలం దండుపల్లిలో, తూప్రాన్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, తూప్రాన్ లోని నవ దుర్గ రైస్ మిల్, సాయినాథ్ రైస్ మిల్, వీరభద్ర రైస్ మిల్, మాసాయిపేట లోని వెంకట సాయి రైస్ మిల్, నార్సింగి మండలంలోని శ్రీ తిరుమల రైస్ మిల్, న్యూ తిరుమల రైస్ మిల్, భాగ్య లక్ష్మి రైస్ మిల్, హనుమాన్ రైస్ మిల్, సప్తగిరి రైస్ మిల్లులను జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాలవర్షాలతో ధాన్యం సేకరణలో కాస్త ఇబ్బందులు ఎదురైనా ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉన్నందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేశామని అన్నారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి ట్యాగింగ్ చేసిన మిల్లులకు తరలించవలసినదిగా కేంద్రం నిర్వాహకుల ను ఆదేశించామన్నారు. రైస్ మిల్లర్లు హమాలీలలను ఎక్కువగా పెట్టుకొని లారీలు వచ్చిన 24 గంటలలోగా ధాన్యం దించుకోవాలని, ఎట్టిపరిస్థితులలో మిల్లుల వద్ద లారీలు వేచి ఉండరాదని స్పష్టం చేశారు. అకాల వర్షాలవల్ల ధాన్యం కాస్త చెడిపోయిన, తాళ్లు ఉన్నా రైతుల పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వం ఆదేశాల మేరకు ధాన్యాల్లో ఎటువంటి కోత విధించరాదని మిల్లర్లకు స్పష్టం చేశారు. భారత ఆహార సంస్థకు పెండింగ్ ఉన్న సి.ఏం. ఆర్. రైస్ ను ఈ నెలాఖరు వరకు అందించుటకు గడువు ఉన్నందున, లక్ష్యం మేరకు రోజు 3 ఏ.సి.కే. ల చొప్పున ధాన్యాన్ని సనత్ నగర్ లోని ఎఫ్.సి.ఐ. కి తరలించవలసినదిగా మిల్లర్లకు సూచించారు. ఈ సందర్భంగా గన్ని సంచులపై స్టెన్సిల్స్ వేస్తున్న (ముద్ర) పనులను పరిశీలిస్తూ జాగ్రత్త అన్ని అక్షరాలూ పడేలా వేయాలన్నారు. ధాన్యం భద్రపర్చుటకు స్థలాభావం కొరత లేదని అందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి రోజు ధాన్యం సేకరణ ప్రక్రియపై మానిటరింగ్ చేస్తున్నామని, గోనె సంచులు, లారీల సమస్యలు ఉత్పన్నం కాకుండా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో లేదా వే బ్రిడ్జ్ కాంటా లలో తూకంలో ఎటువంటి తేడాలు గమనించిన కంట్రోల్ రూమ్ 08452-223360, 98805915768 నెంబర్లకు ఫిర్యాదు చేసిన వెంటనే తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇప్పటి వరకు జిల్లాలో 407 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 25,319 మంది రైతుల నుండి 218 కోట్ల 16 లక్షల విలువ గల 1,05,901 మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేసి 9,976 మంది రైతుల ఖాతాలో 77 కోట్ల 21 లక్షలు వేశామని, టాబ్ ఎంట్రీ కూడా వేగవంతంగా జరుగుతున్నదని త్వరలో మిగతా రైతులకు ధాన్యం కొనుగోలు డబ్బులు వేస్తామని రమేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ మండల తాసిల్దార్ జ్ఞానజ్యోతి, మనోహరాబాద్ మాసాయిపేట్ మండల తాసిల్దార్ బిక్షపతి, మాలతి, సత్యనారాయణ , కేంద్రం నిర్వాహకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.