ప్రజా బలం ప్రతి నిధి ములుగు జిల్లా ఆగష్టు 09 :
రాబోవు గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓ లు, గ్రామ పంచాయితిల సెక్రటరీలు, ఈ – పంచాయతీ ఆపరేటర్లకు గ్రామపంచాయతీ ఎన్నికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలలో ఓటరు జాబితాను రూపొందించడం పట్ల ఎన్నికలు నిర్వహించే అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో రూపొందించిన ఓటరు జాబితా ఆధారంగా గ్రామపంచాయతీ ఓటర్ లిస్టు తయారు చేయడం జరుగుతుందని, ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ టి – పోల్ లో గ్రామపంచాయతీ ఓటర్ జాబితా నుండి వార్డుల వారిగా మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఎన్నికలు విధులు నిర్వహించనున్న ప్రతి ఒక్కరు ఎలెక్షన్ పనులను నిబద్ధతతో, ప్రణాళిక బద్ధంగా చేసేందుకు పూర్తి అవగాహన పెంపొందించు కోవాలని, ఎట్టి పరిస్థితులలో పొరపాట్లు జరగకుండా T-Poll లో ఓటర్ లిస్ట్ మెర్జింగ్ జాగ్రత్తగా చేయాలనీ, నిర్లక్ష్యం వహిస్తే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి సంపత్ రావు, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓ లు, గ్రామ పంచాయతీల కార్యదర్శిలు ఈ – పంచాయతీ ఆపరేటర్ లు పాల్గొన్నారు.