ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జూబ్లీహీల్స్ ప్రజాబలం ప్రతినిధి:ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విస్తరణకు హైదరాబాద్ నగరమే కేంద్ర బిందువుగా ఉంటుందని, దేశంలో మరే ఇతర నగరం అందుకు సన్నద్ధం కాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నాస్కామ్ సహకారంతో తెలంగాణ ఎఐ మిషన్, టీ`ఎఐఎం వంటి ప్రణాళికలకు తోడు కొత్తగా నిర్మించబోయే ఏఐ హబ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఒక తిరుగులేని నగరంగా వెలుగొందటం ఖాయమని అన్నారు.
హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా రెండు రోజులపాటు జరిగే ప్రతిష్టాత్మకమైన ఏఐ గ్లోబల్ సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. తెలంగాణ ఏఐ రోడ్ మ్యాప్ ను, ఏఐ సిటీ నమూనాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
సాంకేతికత, ఆవిష్కరణ లేకుండా సమాజంలో మార్పులు అసాధ్యమని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. పారిశ్రామిక రంగంలో కొత్త విప్లవాలు పుట్టుకొచ్చిన ప్రతిసారి వాటి భవిష్యత్తును అంచనా వేయడంలో తడబాట్లు జరిగాయని, ప్రస్తుత ఏఐ విప్లవం విషయంలోనూ అదే జరుగుతోందని, మార్పుకు సిద్దంగా ఉంటేనే ముందుకు వెళ్లగలమని చెప్పారు.
ప్రస్తుతం ఎఐ విప్లవం కొనసాగుతోందని, ఆ రంగంలో అపారంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు హైదరాబాద్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ఏఐ రంగంలో రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నామన్నారు.
అందుకు ఏఐ నిపుణులతో కలిసి ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు. హైదరాబాద్ ను ఎఐ హబ్ గా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే గ్లోబల్ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తోన్న ఎఐ హబ్ లో ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలన్నీ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, టెక్ రంగానికి చెందిన ప్రముఖులు, ఏఐ నిపుణులు పాల్గొన్నారు.