ఖమ్మం ప్రతినిధి మే 19 (ప్రజాబలం) ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ లో శ్రీకృష్ణ రూపంలో గల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు పై హైకోర్టు స్టే విధించినప్పటికీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నట్లు అధికార మదంతో విగ్రహంలోని పించం, ప్లూటులను తొలగించైనా సరే విగ్రహ స్థాపన మాత్రం ఆపేది లేదనే వ్యవహార శైలిపై బీఎస్పీ ఖమ్మం అసెంబ్లీ ఇన్చార్జి అయితగాని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. విగ్రహానికి పించం, ప్లూటులను తొలగిస్తే రాముని రూపంలోకి వస్తుంది గానీ రామారావు రూపంలోకి రాదుగా అని యద్దేవా చేశారు. స్థానిక నాయకుని నియంతృత్వ పోకడలను ఖమ్మం ప్రజలు చీదరించుకుంటున్నారని, ఇకనైనా తన విధానాలను మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాముని పై ప్రేమను వలకబోస్తూ రాష్ట్రాన్ని రావణకాష్టం చేయాలనుకునే కుహానా మత మౌడ్య పార్టీ నాయకులు ఈ రామావతార రామారావు పై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ అనేది ఎవడబ్బ సొమ్మో కాదని, అది సబ్బండ కులాల సొత్తని గుర్తు చేశారు. వివాదాస్పదమైన విగ్రహ నిర్మాణం ఆపకుండా, ఒంటెద్దు పోకడతో పోయి ముప్పు కొని తెచ్చుకోవద్దని హితవు పలికారు. సబ్బండ కులాల అభివృద్ధి మ్యానిఫెస్టోగా అధికారంలోకి వచ్చి, కేవలం ఒక్క కులానికే ప్రతినిధిగా వ్యవహరించడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఇటువంటి కుల రాజకీయాలను బీఎస్పీ పార్టీ సహించదని, ఈ విగ్రహం స్థానంలో సబ్బండ కులాల అభివృధ్ధికి కృషి చేసిన మహనీయులైన మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పి తీరుతామన్నారు.