పేదల భూములు లాక్కుంటే తిరుగుబాటు తప్పదు

 

డంపింగ్ యార్డ్ ను ఎత్తివేయాలి

లబ్ధిదారులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి

కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 9

ప్రభుత్వం నివేశన స్థలాలు కేటాయించి, తిరిగి అదే స్థలం డంపింగ్ యార్డ్కు కేటాయించడం సరికాదని వెంటనే డంపింగ్ యార్డ్ ను ఎత్తివేసి లబ్ధిదారులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని లేదంటే ఈ ప్రభుత్వానికి పేదల తిరుగుబాటు తప్పదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున వర్షంలో సైతం ధర్నా నిర్వహించి, జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ 2006-07 సంవత్సరంలో నాటి,నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలను గుర్తించి జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 275, 277, 278లో 370 మంది లబ్ధిదారులకు నివేశన స్థలాల పట్టాలు పంపిణీ చేశారన్నారు. పట్టాలు పంపిణీ చేసి కనీస సౌకర్యాలు కల్పించడంలో నాటి పాలకులు పూర్తిగా విఫలమైనారన్నారు. అనేక వ్యయప్రయాసాలకు ఓర్చి, అప్పులు తెచ్చి కొంతమంది ఇల్లు నిర్మించుకొని సంవత్సరాలు తరబడి కనీస సౌకర్యాలు లేకున్నా నివాసం ఉన్నారని, అదే పేదలకు ఇచ్చిన స్థలంలో మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ కు కేటాయించామని రెవెన్యూ అధికారులు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులే ఇలా చేయడం దుర్మార్గమన్నారు.
370 మంది లబ్ధిదారులకు 80 గజాల చొప్పున నాటి, నేటి కాంగ్రెస్ ప్రభుత్వమే గుర్తించి నివేశస్థలాలు కేటాయించిందని, వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రజల ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీదేనన్నారు. సంవత్సరాల తరబడి లబ్ధిదారులు తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఎమ్మార్వో మొదలుకొని, కలెక్టర్, మంత్రుల చుట్టూ పలుమార్లు తిరిగి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోగా కేటాయించిన స్థలాన్ని డంపింగ్ యార్డ్కు కేటాయించామని చెప్పడం శోచనీయమన్నారు. వెంటనే డంపింగ్ యార్డ్ ని ఎత్తివేసి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఐదు లక్షలు, కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు నిధులు మంజూరు చేసి కేటాయించిన స్థలంలోనే ఇల్లు కట్టించి ఇవ్వాలని, త్రాగునీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం, రహదారిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.లబ్ధిదారులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని తమకు కేటాయించిన స్థలము తమకే ఉండాలని కోరుతున్నారని, వారి కోరిక న్యాయబద్ధమైనవన్నారు. పొమ్మనలేక పొగబెట్టినట్లు మున్సిపాలిటీ సిబ్బంది తాము కట్టుకున్న ఇళ్ల ముందు చెత్త కుప్పలు పోయడంతో దుర్గంధం వస్తుందని, రోగాల బారిన పడుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వానికైనా పేదలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉంటుందని, నోటికి వచ్చిన ముద్దను తిరిగి లాక్కోవడం మంచిది కాదన్నారు. 370 మందిలో అందరూ కూడా కూలి చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారేనని, అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నిరుపేదలే లబ్ధిదారులుగా ఉన్నారన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ స్పందించి లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, డంపు యార్డును ఎత్తివేయాలని వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. లేనియెడల బాధితుల పక్షాన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తుందని, సమస్య పరిష్కారం అయ్యేంతవరకు నిరంతరం బాధితులకు వెన్నంటే ఉంటుందన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి నరేష్ పటేల్, లబ్ధిదారులు నాగిశెట్టి వెంకటేశ్వర్లు, పూదరి అనంత, పిక్కల కమల, దామెర సంతోష్, సత్తి సమ్మయ్య, గొర్రె స్వరూప, మాదాసు రవీందర్లతోపాటు 120 మందికి పైగా లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking