భారీ వర్షాల నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

 

ఖమ్మం ప్రతినిధి జూలై 20 (ప్రజాబలం) ఖమ్మం భారీ వర్షాల నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రెవిన్యూ, మునిసిపల్, పంచాయతీ రాజ్, ఇర్రిగేషన్ అధికారులకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. డ్రెయిన్స్ లలో నీటి ప్రవాహానికి అడ్డంకులు కలగకుండా ప్రతి డ్రెయిన్ నుండి వర్షపు నీరు ఆటంకం లేకుండా ప్రవహించేలా చూడాలన్నారు. జిల్లాలోని నీటి వనరుల నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. రిజర్వాయర్, చెరువుల నీటి నిల్వలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆయన తెలిపారు. పొంగుతున్న వాగులు, నిండివున్న చెరువుల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకువాలన్నారు. నీటి ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్టుల వద్ద రాకపోకలు నిలిపి, బారికేడ్లు, సైన్ బోర్డులు ఏర్పాటుచేయాలని, బాధ్యత గల అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. కూలిపోయే ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు పాఠశాల, గ్రామ పంచాయతీ, ప్రభుత్వ భవనాలను గుర్తించి పునరావాస కేంద్రాల ఏర్పాటు చేయాలన్నారు. పునరావాస కేంద్రాల వద్ద వైద్య శిబిరాల ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ వైర్లు తెగిపోతే వెంటనే మరమ్మత్తులు చేయాలని, వ్రేలాడే విద్యుత్ తీగలు, ఇండ్ల పై నుండి వెళ్లే తీగలు, రక్షణ లేని ట్రాన్స్ఫార్మర్ల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ షాక్ లతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. పారిశుద్ధ్యం పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, నీరు నిల్వలు ఉండకుండా, చెత్త నిల్వలు లేకుండా చూడాలన్నారు. రెవిన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, విద్యుత్, మునిసిపల్, ఇర్రిగేషన్ తదితర శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని, సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ టెలీ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ఇర్రిగేషన్ సిఇ విద్యాసాగర్, విద్యుత్ ఎస్ఇ సురేందర్, ఆర్డీవోలు, ఎంపిడిఓ లు, తహశీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking