మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో పెరిగిన ఓటర్లు

రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి (ప్రజాబలం)6 అక్టోబర్:
రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారులు, బూత్ లెవల్ సిబ్బంది ప్రత్యేకంగా ఇంటింటికీ వెళ్ళి ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగిందని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయా రాజకీయ పార్టీల నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ… జిల్లా వ్యాప్తంగా ఓటరు తుది జాబితాను ఈనెల 4వ తేదీన ప్రకటించడం జరిగిందని… 5వ తేదీన అందుకు సంబంధించిన ప్రతులను రాజకీయ పార్టీలకు పంపడం కూడా జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని గుర్తింపు పొందిన అన్ని పార్టీల నాయకులతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు సంబంధిత ఎన్నికల అధికారులు, సిబ్బందికి సహకరించి సమన్వయంతో ముందుకెళ్ళి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలు నిర్వహించేలా వారి తోడ్పాటునందించాలని కలెక్టర్ అమోయ్ కుమార్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు తదితర సమస్యలను కలెక్టర్ అమోయ్ కుమార్ దృష్టికి తీసుకురాగా… అందుకు స్పందించిన కలెక్టర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపడతామని ఈ విషయంలో సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్ళి వాటిని పరిష్కరిస్తారని ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కలెక్టర్ అమోయ్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో పాటు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఓటర్ల వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయా పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సూపర్వైజర్లు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking