ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 30 (ప్రజాబలం) ఖమ్మం సెప్టెంబర్ 1 నుండి ప్రభుత్వ వైద్య కళాశాల తరగతులు ప్రారంభం కానున్న దృష్ట్యా పనులన్ని బుధవారం కల్లా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్ ప్రభుత్వ కళాశాల సందర్శించి, పనుల పురోగతిని పరిశీలించారు. లెక్చర్ హాల్ కు సంబంధించి ఏసీ, ఫర్నీచర్ ఏర్పాటుతో సహా పనులన్ని పూర్తి చేయాలన్నారు. ఆర్ అండ్ బి శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న బాలికల, పాత జిల్లా వైద్య ఆరోగ్యాధికారి కార్యాలయం మొదటి అంతస్థులో ఏర్పాటుచేస్తున్న బాలుర హాస్టళ్లను కలెక్టర్ పరిశీలించారు. డైనింగ్ హాల్, కిచెన్ రూమ్, డార్మెటరీ లను పరిశీలించారు. డోర్, కిటికీలకు వైర్ మెష్ లు ఏర్పాటు చేయాలన్నారు. టాయిలెట్లు పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాలేదని, బుధవారం రాత్రి కల్లా పనులు పూర్తి చేయాలని అన్నారు. హాస్టళ్ల లోపల శుభ్రపరచాలని, పరిసరాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అన్నారు. సెప్టెంబర్ 1 నుండి తరగతులు ప్రారంభం కానున్నందున విద్యార్థులు గురువారం నుండే వచ్చే అవకాశం ఉందని, స్థానికేతరులను ఫోన్ ద్వారా సంప్రదించి, హాస్టల్ సౌకర్యం గురించి వివరించి ప్రభుత్వ హాస్టల్ లో చేరేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మిగులు పనులన్ని యుద్ధప్రాతిపదికన గురువారం లోగా పూర్తి చేయాలని, కళాశాల ప్రారంభ దినాన మంచి వాతావరణం స్పూరించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.