ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 30 : విద్యార్థి దశ నుండి విద్యార్థుల వినూత్న ఆలోచనలతో సమాజ హిత ఆవిష్కరణలు రూపొందుతాయని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024-25, జిల్లాస్థాయి ఇన్స్ ఫైర్ అవార్డుల ప్రదర్శన 2023-24 కార్యక్రమానికి మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య లతో కలిసి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తూ విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, తరగతులకు అవసరమైన ఉపాధ్యాయుల నియామకాన్ని చేపట్టి విద్యార్థులకు కార్యచరణ ప్రకారం విద్యా బోధన అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీసి భవిష్యత్తులో మరిన్ని ప్రజా ప్రయోజనకర అంశాల సాధన దిశగా ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ఇన్స్ పైర్ అవార్డులలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అత్యుత్తమ ప్రతిభ గల విద్యార్థులను ఎంపిక చేసి వారి ఆవిష్కరణలను ప్రోత్సహించడం జరుగుతుందని, విద్యార్థులకు గుర్తింపు రావడంతో పాటు నగదు బహుమతి అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు ప్రజలకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణల సాధనలో ముందు ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, విద్యార్థుల నూతన ఆలోచనల ద్వారా ఆవిష్కరణలను రూపొందించి విజయం బాటలో నడిపించాలని, దేశ అభివృద్ధికి దోహదపడాలని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు సైన్స్ ను వినియోగించి ఆవిష్కరణలను రూపొందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రదర్శించడం జరుగుతుందని, సమాజంలోని సామాన్య సమస్యలకు సరైన పరిష్కారం చూపుతూ విద్యార్థుల రూపొందించే ఆవిష్కరణలకు ఎంతో గుర్తింపు వస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమాజ హిత విద్యార్థుల ఆలోచనలను ప్రోత్సహించాలని, వారు అందించే వినూత్న ఆలోచనల ద్వారా భవిష్యత్తు సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు రూపొందుతాయని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల యాజమాన్యం, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Next Post