హుజూరాబాద్‘చే’జారుతోందా?

 

-‘పార్లమెంటు’ లక్ష మెజార్టీ రీచ్ కాలే
– సగం కూడా ఓట్లు రాలేదు..‘అసెంబ్లీ’ కంటే తక్కువ.
– అన్నీ తానై నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రణవ్ ‘లోక్‌సభ’ ప్రచారం.

హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి జూన్ 8

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో ‘చేతి’ బలం తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 54 వేల ఓట్లు రాగా, పార్లమెంటుకు వచ్చే సరికి సుమారు 50 వేలకు పరిమితమైంది. నియోజకవర్గ ఇన్ చార్జి లక్ష మెజార్టీ లక్ష్యంగా లోక్ సభ ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. అభ్యర్థి తరఫున హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో క్యాంపెయిన్ చేశారు. అన్నీ తానై ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు హామీలిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్, ఇండియా కూటమికి మద్దతు తెలపాలని అభ్యర్థించారు. జూన్ 4న విడుదలైన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ‘అసెంబ్లీ’ కంటే తక్కువ ఓట్లు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

హుజూరాబాద్ ‘హస్తం’లో అసలేం జరుగుతోంది?

హుజూరాబాద్ నియోజవర్గ పరిధిలో పార్లమెంటు ఎన్నికల టైం నాటికి కాంగ్రెస్ పార్టీకి ఫుల్ జోష్ లోకి వచ్చింది. ఇతర పార్టీల నాయకుల చేరికలతో పార్టీలో నూతన ఉత్సాహం కనబడింది. కానీ, ఆ తర్వాత కాలంలో ముసలం షురూ అయింది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వద్దకు వెళ్లి కొందరు కలవగా, వారిని పార్టీ సస్పెండ్ చేసింది. అంతటితో అంతర్యుద్ధం ముగిసిందనేకునే లోపే మళ్లీ నేతల మధ్య డైలాగ్ వార్ షురూ అయింది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. అది చూసి ఇతర పార్టీల లీడర్లు, కార్యకర్తలు, జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకరి గొయ్యిని మరొకరు తవ్వుకుంటున్నాని, ఇలానే కొనసాగితే ‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి పెద్ద మైనస్ అవుతుందని కొందరు చర్చించుకుంటున్నారు.

లీడర్, కేడర్ మధ్య సమన్వయ లోపం?

కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ అసెంబ్లీ ఎన్నికల ముందర కాంగ్రెస్ పార్టీలో చేరి..అతి తక్కువ టైంలో నే కేడర్, ప్రజల వద్దకు వెళ్లారు. ప్రజావిశ్వాసాన్ని తనకున్నంత సమయంలోనే చూరగొనే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓటమిపాలైన పార్టీ జెండా వీడకుండా నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ..ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్నారు. అయితే, సౌమ్యుడిగా ఉన్న ఆయనపైన కొందరు విమర్శలు చేయడం..అధిష్ఠానం వెంటనే సస్పెన్షన్ వేటు వేయడం చకచకా జరిగింది. కాగా, గతంలో నాయకులు చేసే ఓపెన్ టాక్ విషయంలో చర్యలు తీసుకున్న సందర్భాలే లేవు. కానీ ఇటీవల సస్పెన్షన్లతో పాటు షోకాజులు ఇచ్చే సంస్కృతికి హస్తం పార్టీ శ్రీకారం చుట్టడం సంచలనంగా మారింది. అయితే, ఈ క్రమంలోనే హస్తం పార్టీలోని లీడర్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రోద్బలంతో నియోజవర్గ ఇన్ చార్జి ప్రణవ్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తు్న్నారని నాయకులు ఆరోపిస్తున్నారు. అదే నిజమైతే ఇప్పటికే హస్తం పార్టీలో చేరిన లీడర్లు ప్రతిపక్ష పార్టీ లీడర్‌కు కోవర్టుగా ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా హుజూరాబాద్ కాంగ్రెస్‌లో గ్రూపుల కలకలం, నేతల మధ్య విభేదాలు పొడసూపకుండా, అందరినీ కలుపుకొని, సమన్వయంతో పార్టీని ఇన్ చార్జి ప్రణవ్ బలోపేతం చేయాలని, ఫలితంగా ‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటే అవకాశాలుంటాయని కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking