కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి

జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన : కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరూరి కుమార్.

ప్రజాబలం వరంగల్ ప్రతినిధి ఏప్రిల్ 5: స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు దాటిన నేటికీ భారతదేశంలో కొనసాగుతున్న దుర్మార్గ, దారుణమైన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి సమానత్వం సాధించడమే బాబు జగ్జీవన్ రామ్ కి ఇచ్చే ఘనమైన నివాళి అవుతుందని కుల వివక్ష పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరూరి కుమార్ అన్నారు. వరంగల్ రామన్నపేట ప్రధాన కూడలిలో కెవిపిఎస్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మనువాద, మతోన్మాదుల పాలనలో దుర్మార్గమైన, దారుణమైన కుల వ్యవస్థ పెట్రేగి పోతుందని అన్నారు. రాజ్యాంగ హక్కులు కాల రాయడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్లకు కట్ట పెడుతూ రిజర్వేషన్లు అమలులు లేకుండా చేస్తున్నారని అన్నారు. జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కార్మిక సంక్షేమ చట్టాలను తీసుకు వచ్చాడని ఆయన తెచ్చిన కార్మిక చట్టాలను మనువాద, మతన్మాద పాలకులు 4 లేబర్ కోడ్లుగా పెట్టి కార్మిక చట్టాలను యాజమాన్యాలకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఉద్యోగుల బీమా చట్టం ద్వారా ప్రావిడెంట్ ఫండ్ ను ఏర్పాటు చేసి కార్మికుల జీవితాలకు భరోసా కల్పిస్తే నేటి మనవాద, మతోన్మాద, పాలకులు ఆ నిధులను కాజేస్తున్నారని, దేశంలో కుల వ్యవస్థను పెంచి రాజకీయ లబ్ధి పొందుతున్నారనీ , అందుకు మన రాష్ట్రంలో జరుగుతున్న కుల దురంకార హత్యలే నిదర్శనమని అన్నారు. వరంగల్ జిల్లాలో సైతం దళిత ఉద్యోగులకు ఇల్లు అద్దెకు ఇవ్వకపోవడం మనము తరచు వింటూనే ఉన్నామని అన్నారు. దేశంలో కుల అంతరాలు తొలగినప్పుడే దేశ అభివృద్ధి ముందుకు కొనసాగుతుందని కులాల మధ్య అంతర్యాలు ఉండకూడదని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి సమానత్వం సాధించడం మే లక్ష్యం చేసుకొని జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో పోరాడుదాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొంగర వరుణ్, మడిపోజు అనిల్, ఇనుముల కిరణ్, కుమారస్వామి, వీరస్వామి, దామెర శీను, శివ, రమేష్, దాసు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking