బలహీన,అణగారిన వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు డా,,బాబు జగ్జీవన్ రామ్  జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 05 : బలహీన, అణగారిన వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు డా,,బాబు జగ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకొని జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు పోటు రవీందర్ రెడ్డి, షెడ్యూల్డ్ కులముల కార్పొరేషన్ ఈ.డి. దుర్గాప్రసాద్ తో కలిసి హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
డా,,బాబు జగ్జీవన్ రామ్ 30 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు వివిధ శాఖలలో కేంద్రమంత్రిగా విశిష్ట సేవలు అందించారని అన్నారు. సమాజంలో వివక్షపై పాఠశాల స్థాయి నుండి వ్యతిరేకిస్తూ బలహీన, అణగారిన వర్గాల సమానత్వం కోసం కృషి చేశారని అన్నారు. భారతదేశ ఉప ప్రధానిగా, వ్యవసాయ,ఆహార,రక్షణ శాఖలతో పాటు వివిధ శాఖలలో మంత్రిగా అనేక సంస్కరణల ద్వారా ప్రజల సంక్షేమం కోసం విశిష్ట సేవలు అందించారని అన్నారు.బడుగు,బలహీన వర్గాల సంక్షేమం,సామాజికంగా, ఆర్థికంగా,రాజకీయంగా అన్ని రంగాలలో అభివృద్ధి కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన కృషి సదా స్మరణీయమని,ఆయన ఆచరించిన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.డా,,బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని,మహనీయులు అందించిన ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking