డిసిసి అధ్యక్షులకు విద్యార్థి యువజన నాయకులు వినతి
ఖమ్మం ప్రతినిధి మార్చి 19 (ప్రజాబలం) ఖమ్మం గత వారంలో ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా జిల్లాలో పార్టీ ని అగ్రస్థానంలో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న మహమ్మద్ జావేద్ కు చోటు దక్కకపోవడం బాధాకరమని విద్యార్థి యువజన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా జావేద్ తనదైన శైలిలో అధికార పార్టీపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే, అధికారుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించారని, కేసులు బెదిరింపులు లను సైతం లెక్క చేయకుండా ప్రజా సమస్యలపై వెనక్కు తగ్గకుండా బలమైన కాంగ్రెస్ గొంతును వినిపించారని గుర్తు చేశారు. అలాంటి నికార్సైన నాయకులను పార్టీ గుర్తించకపోవడం బాధాకరమని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో ప్రతిపక్ష నాయకులపై బీఆర్ఎస్ చేసిన కుట్రలను సైతం ఎలా ఎదుర్కున్నారో జిల్లా అధ్యక్షునిగా మీకు తెలియంది కాదని అలాంటి కష్టాన్ని సైతం పంటి బిగువున పెట్టుకొని పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కష్ట నష్టాలు పడ్డారని తీరా పార్టీ అధికారంలోకి వచ్చాక కష్టాన్ని గుర్తించక పోవడం శోచనీయమని అన్నారు. అసెంబ్లీ సీటు ఇస్తారేమో అని ఆశించిన తనకి మున్ముందు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆశపెట్టి నామినేటెడ్ పదవుల్లోనూ ఆయన సేవలు గుర్తించకపోవడం దారుణమని అన్నారు. పార్టీలో ఎప్పటి నుండో పని చేస్తూ పార్టీకే కట్టుబడి ఉన్న నాయకులను గుర్తించి వారికి సరైన స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.లేదంటే కాంగ్రెస్ యువజన విద్యార్థి నాయకుల తరపున తదుపరి కార్యాచరణకు సిద్ధం అవుతామని హెచ్చరించారు.