ఇంటింటికి టిడిపిలో జిల్లా అధ్యక్షులు మహంకాళి రాజన్న
జగిత్యాల, మార్చి 21: నేటి తెలంగాణా అభివృద్ధికి ఆనాటి టిడిపి పాలనలోనే అభివృద్ధికి వేసిన పునాది అని ఆ ఫలితాలే నేడు కనిపిస్తున్నాయని చేతల టిడిపిని ఆదరించి అధికారంలోకి తేవాలని టిడిపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు మహంకాళి రాజన్న అన్నారు. మంగళవారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా జగిత్యాల రూరల్ మండలంలోని థరూర్, నర్సింగాపూర్, వంజరిపల్లి గ్రామాలలో గడప గడపకు వెళ్లి టిడిపి హయాంలో చేపట్టిన అభివృద్ధిపై ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజన్న మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ మొదలు చంద్రబాబు హయాంలో ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధిలో ముందుకుసాగిందన్నారు. చంద్రబాబు హయాంలో హైటెక్ సిటీ వంటి నిర్మాణాలతో అభివృద్ధికి పునాది పడిందన్నారు. అలా కొనసాగిన అభివృద్ధి 2004 నాటి వరకు కొనసాగి నేటి అభివృద్ధికి బాటలు వేసిందన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పాలించిన కాంగ్రెస్ పాలంలోను అభివృద్ధి అంతంత మాత్రమేనన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం మోసపూరిత హామీలు, ప్రకటనలతో ప్రజలను మోసగిస్తోందన్నారు. ఇప్పుడేమో లీకేజీలు, లిక్కరు దందాలతో పాలనను గాలికొదిలేసిందన్నారు. టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తించాలని కాంగ్రెస్, తెరాస పాలనల్లోని అభివృద్ధి తో పోల్చిచూసి టిడిపిని ఆదరించి రాబోయే ఎన్నికల్లో ఓట్లతో ఆశీర్వదించాలని జిల్లా అధ్యక్షులు మహంకాళి రాజన్న గ్రామీణ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎల్.చంద్రశేఖర్, బత్తుల కొండయ్య, ఒరుగంటి భార్గవ్ రామ్, సోమా నారాయణరెడ్డి, కొండ శ్రీధర్, కోయ బాలకృష్ణ, నక్క లక్ష్మణ్, జలందర్ రెడ్డి, సంతోష్, సాన రాములుతో పాటు పలువురు ఉన్నారు.