సీఎం కేసీఆర్ కు జర్నలిస్టుల కృతజ్ఞతలు  ఇళ్ల స్థలాలు కేటాయింపు పట్ల ఆకుతోట ఆదినారాయణ హర్షం

ఖమ్మం  ప్రతినిధి జనవరి 19 (ప్రజాబలం) ఖమ్మం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జర్నలిస్టులకు  ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని  ఖమ్మం భారీ బహిరంగ సభలో ప్రకటించడం పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టి.జె.ఎఫ్ ) ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, రజనీకాంత్ లు గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి నెల రోజుల్లోనే ప్రభుత్వ స్థలం ఉంటే ప్రభుత్వ స్థలంలోనే, లేకుంటే ప్రైవేటు భూమిని సేకరించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందివ్వాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లకు సీఎం ఆదేశించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

ఇటీవల ఖమ్మం ఉమ్మడి జిల్లాల టీయూడబ్ల్యూజే (టి.జె.ఎఫ్) మహాసభ ఎస్ఆర్ గార్డెన్ లో జరిగాయని, ఈ మహాసభలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టమైన హామీ ఇచ్చారని, జర్నలిస్టుల చిరకాల స్వప్నం ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తానని, ముందుగా ఖమ్మం నుంచి ప్రారంభించి, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చేతుల మీదుగా జర్నలిస్టులకు పట్టాలు పంపిణీ చేయించి రోల్ మోడల్ గా నిలుస్తానని హామీ ఇవ్వటం జరిగిందన్నారు.

మంత్రి అజయ్ కుమార్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ముఖ్యమంత్రితో మాట్లాడి సీఎం చేత కూడా భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇస్తూ సహచర మంత్రులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ నెల రోజుల్లోనే ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం సంతోషదాయకమన్నారు .

జర్నలిస్టుల పక్షాన తమ యూనియన్ నిలబడి, దశలమారి ఆందోళనల, విజ్ఞప్తుల  ఫలితంగా జర్నలిస్టుల కల నెరవేరబోతుందని వారు హర్షం వ్యక్తం చేశారు.

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం పట్ల సీఎం కేసీఆర్ కు జర్నలిస్టుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking