హైదరాబాద్, (ప్రజాబలం ప్రతినిధి) తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అయిన కూచిపూడి నృత్యం ప్రపంచ యవనికపై మరోసారి సగర్వంగా నిలిచింది. నగరంలోని గచ్చిబౌలి వేదికగా శనివారం (డిసెంబర్ 27, 2025) జరిగిన భారీ నృత్య ప్రదర్శనలో తన అద్భుతమైన నాట్య కౌశలంతో కానుకంటి శ్రావణి వంజరి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు. శాస్త్రీయ నృత్యం పట్ల ఆమెకున్న అంకితభావం, నిరంతర సాధన ఈ అరుదైన గౌరవానికి దారితీశాయి. ప్రదర్శనలో శ్రావణి చూపిన హావభావాలు, లయబద్ధమైన పాదఘట్టనలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. కూచిపూడి సంప్రదాయాన్ని ఏమాత్రం పక్కన పెట్టకుండా, అత్యంత కఠినమైన ముద్రలను సైతం అలవోకగా ప్రదర్శించి గిన్నిస్ ప్రతినిధుల ప్రశంసలు అందుకున్నారు. గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన ఈ చారిత్రాత్మక ఘట్టం తెలుగు రాష్ట్రాల కళా వైభవాన్ని చాటిచెప్పింది. ఈ ఘనత సాధించిన అనంతరం శ్రావణి మాట్లాడుతూ.. ప్రపంచ రికార్డు సాధించడం నా జీవితాశయం. ఇది నా ఒక్కదాని కృషి మాత్రమే కాదు. నాకు విద్య నేర్పిన గురువుల శిక్షణ, ప్రతి అడుగులోనూ నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రుల ఆశీస్సులు, స్నేహితుల తోడ్పాటు వల్లే ఈ విజయం సాధ్యమైంది అని సంతోషం వ్యక్తం చేశారు. ప్రాచీన కళలను ఆదరించడం, వాటిని భవిష్యత్ తరాలకు అందించడం మనందరి బాధ్యత అని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలుగు కళాకారిణి అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించడం పట్ల వంజరి సామాజిక వర్గ ప్రముఖులు మరియు పలువురు కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణి సాధించిన ఈ విజయం యువ కళాకారులకు దిక్సూచిగా నిలుస్తుందని కళాభిమానులు కొనియాడుతున్నారు.