కరీంనగర్ జిల్లాకు మొండి చేయి చూపించిన కేంద్రం

సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి

కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి జూలై 23

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం రోజున 2024-25 సంవత్సరానికి గాను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజలను, వ్యవసాయ కార్మికులను, గ్రామీణ పేదలను, రైతులను, అసంఘటిత కార్మికులను, మధ్యతరగతి వర్గాలను, నిరాశపరిచిందని విదేశీ పెట్టుబడుదారులకు, కార్పొరేట్లను సంతృప్తిపరిచే బడ్జెట్ గా ఉందని, దేశ ప్రజల కష్టాన్ని, బాధలను తీర్చే బడ్జెట్ కాదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీల ఊసే లేదని ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు మొండి చేయి చూపారన్నారు. త్రిబుల్ ఐటీ ఊసే లేదన్నారు. జిల్లాలో పేరుకుపోయిన పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు లేవని, కొత్త ప్రాజెక్టులు ఏమీ ప్రతిపాదించలేదని, జమ్మికుంట రైల్వే స్టేషన్ నుండి ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అనే చందంగా అనేక ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగకుండా వెళ్తున్నాయని అనేక ఎక్స్ప్రెస్ రైళ్లను హాల్టింగ్ పెడితే ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేదన్నారు. జిల్లాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ జిల్లాకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమైనారన్నారు. గత సంవత్సరం కంటే 4 లక్షల కోట్ల బడ్జెట్ పెంచి 48.21 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ అందుకు తగ్గట్టుగా ఆయా రంగాలకు నిధులు ప్రతిపాదించకపోవడం ఆశ్చర్యం వేస్తుందన్నారు. సామాజిక భద్రతలో భాగంగా నాటి యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం తెచ్చిందని, బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం బడ్జెట్లో నిధుల కోత పెడుతూ పథకం నిర్వీర్యం చేస్తుందన్నారు. ఈసారి కూడా బడ్జెట్లో కోత పెట్టారన్నారు. దేశవ్యాప్తంగా కూడు,గూడు గుడ్డలేని కోట్ల మంది ప్రజలు నేటికీ ఉన్నారని వారందరికీ కనీస సౌకర్యాలు కల్పించేందుకు నిధులు కేటాయించకపోవడం బీజేపీ ప్రభుత్వ దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. బడ్జెట్లో పూర్తిగా బిజెపి పాలనలో విద్యా, వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు అన్నారు. మోడీ పాలనలో దేశ ప్రజలకు స్వర్ణ యుగం కాదని దేశాన్ని దివాలా తీయించిన యుగమని అభివర్ణించారు. ఎరువుల కోసం గత సంవత్సరం 1.88 లక్షలు కేటాయిస్తే ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా అంతే పద్దు కేటాయించడం రైతుల పట్ల బిజెపి మొసలి కన్నీరుకు నిదర్శనంగా కనిపిస్తుంది. వృద్ధులు వికలాంగుల పెన్షన్ కు గత సంవత్సరం 9652 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సర బడ్జెట్ లో కూడా పాత బడ్జెట్ నే ప్రతిపాదించడం విడ్డూరమన్నారు. పీఎం ఆవాస్ యోజన పథకం కింద 84 వేల కోట్లు ప్రతిపాదించి చేతులు దులుపుకున్నారన్నారు. గూడు లేని ప్రతి పేదవాడికి ఇల్లు అందని ద్రాక్షగా ఉంటుందన్నారు. ఆహార భద్రతకు నిధులు తగ్గించడం శోచనీయమన్నారు. గత బడ్జెట్లో 2, లక్షల 12 వేల కోట్లు కేటాయిస్తే ఈసారి రెండు లక్షల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. వ్యవసాయ కూలీల రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని నేషనల్ క్రైమ్ బ్యూరో గణంకాలు చెబుతున్నప్పటికీ ఆహార భద్రతకు నిధులు తగ్గించడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. మొత్తంగా ఈ బడ్జెట్ కుర్చీని కాపాడుకునే బడ్జెట్ గా ఉందన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking