మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 4:
కీసర రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు అధికారులందరూ సమన్వయము తో పని చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తీ చేయాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు.
కీసర రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 6 వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో సోమవారం కీసర గుట్టకు వెళ్ళిన కలెక్టర్ గౌతమ్, జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, డిసిపి పద్మజ, ఎంఎల్ ఏ మల్లారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు అభిషేక్ అగస్త్య, విజయేందర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ తటాకం నాగలింగం శర్మ, ఆలయ ఈవో నరేందర్ లతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆలయ పండితులు పూర్ణ కుంభంతో కలెక్టర్ కు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గల సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు క్యూలైన్ లను పెంచాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఆర్టీసీ బస్సులు పెంచాలన్నారు. భద్రతా లోపం తలెత్తకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు. భక్తులకు అత్యవసర చికిత్సకై అవసరమైన వైద్య సిబ్బంది, మందులు అందుబాటులో ఉండాలన్నారు. బ్యారీకేడ్, దర్శనం క్యూ లైన్, పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ప్రస్తుతం ఎండలు పెరుగుతున్నాయని అందుకు జాతరలో భక్తులకు అందుబాటులో అవసరమైన అన్ని చోట్ల త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని వాటర్ వర్క్స్ వారికీ తెలిపారు. జాతరలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలని అందుకు సంబంధించి ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలని ఈ విషయంలో జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. కీసర గుట్ట బ్రహ్మోత్సవాల జాతరలో పూజ సామాగ్రి , ఆహార పదార్థాల నుంచి మొదలుకొని అన్ని రకాల వస్తువుల విక్రయానికి సంబంధించి ధరలు భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలని, ఎక్కువ ధరలకు విక్రయించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులు వ్యాపారులకు తెలపాలన్నారు. జాతర రోజుల్లో ఆలయ పరిసరాల్లో అగ్నిమాపక సిబ్బందితో పాటు ఫైరింజన్ను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కీసర ఆలయంకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని ఆలయ ఈవో, ఛైర్మన్ కు తెలిపారు. మహాశివరాత్రికి కీసరగుట్టలో రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి విజయవంతం చేయాలని కలెక్టర్ సమావేశంలో స్పష్టం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో కీసర ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, , జెట్ పీటీసీలు , ఆలయ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.