కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని వసతులు కల్పించాలి

 

కీసర గుట్టను సందర్శించిన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 9:మహాశివరాత్రి సందర్బంగా కీసర గుట్టలోని శ్రీరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో భక్తులకు అన్ని వసతులు కల్పించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ విషయంలో అధికారులు పూర్తి సమన్వయంతో తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు.
కీసర రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో గురువారం కీసర గుట్టకు వెళ్ళిన కలెక్టర్ అమోయ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, ఆలయ కమిటీ ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, స్థానిక సర్పంచ్, మాధురి, అధికారులతో కలిసి అక్కడి ప్రాంతం మొత్తం కలియదిరిగారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సంబంధించి క్యూలైన్, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అనంతరం ఆలయం వద్ద జిల్లా అధికారులతో సమీక్ష సమావేశంలో కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 18న మహాశివరాత్రి జాతరకు కీసరగుట్టకు భక్తుల సంఖ్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఆయా శాఖలు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు , సౌకర్యాలు కల్పించాలన్నారు. కీసర గుట్టకు వచ్చే భక్తుల సంఖ్య ఈ సంవత్సరం మరింత పెరిగే అవకాశం ఉన్నందున అందుకు అవసరమైన అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కీసర గుట్టకు స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటుగా అందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రామలింగేశ్వరస్వామి జాతర నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలు, ఆయా ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశమున్నందున దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు వేగవంతం చేసి పూర్తి చేయాలని కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులకు తెలిపారు. అలాగే జాతరకు వచ్చే భక్తులు స్నానాలు చేసేందుకు స్నానపు గదులు, మహిళలకు ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేయాలని అదే సమయంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చెయాలి అని తెలిపినారు . దీంతో పాటు బ్యారీకేడ్, దర్శనం క్యూ లైన్, పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు. ప్రస్తుతం ఎండలు పెరుగుతున్నాయని అందుకు జాతరలో భక్తులకు అందుబాటులో అవసరమైన అన్ని చోట్ల త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని ఈ విషయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జాతరలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలని అందుకు సంబంధించి ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలని ఈ విషయంలో జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. అలాగే భక్తులకు అత్యవసర చికిత్సకై ప్రథమ చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేసి అవసరమైన వైద్య సిబ్బందిని జాతరలో అందుబాటులో ఉంచాల్సిందిగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి ఆదేశించారు. జాతరలో భక్తుల సౌకర్యార్థం ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపాలని ఈ విషయంలో ఇప్పటి నుంచే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. దీంతో పాటు కీసర గుట్ట బ్రహ్మోత్సవాల జాతరలో పూజ సామాగ్రి , ఆహార పదార్థాల నుంచి మొదలుకొని అన్ని రకాల వస్తువుల విక్రయానికి సంబంధించి ధరలు భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలని.. ఎక్కువ ధరలకు విక్రయించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులు వ్యాపారులకు తెలియజేయాలన్నారు. జాతర రోజుల్లో ఆలయ పరిసరాల్లో అగ్నిమాపక సిబ్బందితో పాటు ఫైరింజన్ను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కీసర ఆలయంకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని ఆలయ ఈవో, ఛైర్మన్ కు తెలిపారు. మహాశివరాత్రికి కీసరగుట్టలో రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి విజయవంతం చేయాలని కలెక్టర్ అమోయ్ కుమార్ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, కీసర ఆర్డీవో రవి, కీసర ఆలయ ఛైర్మన్ రమేష్ శర్మ, ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, కీసర సర్పంచ్ మాధురి, ఆలయ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking