జిల్లా కలెక్టర్ ను కోరిన ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ముక్రం
జగిత్యాల, ఫిబ్రవరి 9: జగిత్యాల జిల్లాలోని వెల్ఫేర్ బోర్డుల్లో పెండింగ్లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్స్ ను వెంటనే పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎం.డి.ముక్రం కోరారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టిన అనంతరం కలెక్టర్ ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముక్రం మాట్లాడుతూ 2018 నుంచి జిల్లాలోని వెల్ఫేర్ బోర్డుల్లో కార్మికులకు రావాల్సిన డబ్బుల క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయన్నారు. భవన నిర్మాణ రంగంలోని కార్మికులలో కొందరు ప్రమాదవశాత్తు, సహజ మరణం పొందడం జరిగిందన్నారు. అలాగే మెటర్నిటీ, మ్యారేజి బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసుకొన్నవారు చాలామంది ఉన్నారని బెనిఫిట్స్ రాలేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
2023 జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల దరకాస్తులన్నింటిని మీ సేవల్లో రినివల్ చేయాలని ముక్రం కోరారు. అలాగే రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను తొలగించాలని కోరారు. జిల్లా లోని నోడల్ అధికారులు, ఏ. ఎల్.ఓ ల పనివిదానంతో కార్మికులు నష్టపోతున్నారని ముక్రం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 31లోగా కార్మికుల క్లెయిమ్స్ అన్ని పరిష్కరించాలని లేకుంటే జిల్లాలోని భవన నిర్మాణ రంగ కార్మికులందరిని ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ముక్రం హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామిల్ల రాంబాబు, నాయకులు మునుగురి హనుమంతు, ఎం. కిరణ్ కుమార్, సమీర్, దేవదాస్, ధర్మయ్య, డివి రాజు, తదితరులు ఉన్నారు.