కోన‌సీమలో కోడి గెలిచింది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంక్రాంతి పండుగ వచ్చేసింది. కోనసీమ కోడిపందేలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠత‌కు తెరపడింది. కోన‌సీమలో కోడి పందేలదే పై చేయి అయింది. ఉన్న‌తాధికారుల ఒత్తిళ్లతో ఖాకీలు తలొగ్గారు. గత 15 రోజులుగా కోడి పందాలు, గుండాట్లను అరిక‌ట్టాల‌ని అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కోనసీమ వ్యాప్తంగా బరుల్లోనూ కోడి కాలు దువ్వుతోంది. పండుగ మూడు రోజులు నిర్వహించుకునేందుకు రాజకీయ నేతల అండ‌దండ‌ల‌తో రాత్రికి రాత్రి పందేల కోసం రంగం సిద్దం చేశారు. సాంప్రదాయాల ముసుగులో పందేలకు కాలు దువ్వుతున్నారు ఇక్క‌డి రాజ‌కీయ నాయ‌కులు. మూడు రోజులు పాటు రాత్రి పగలూ తేడా లేకుండా కోడిపందాలు, గుండాట,పేకాట ఆడుకునేందుకు గ్రామాల్లో రంగం సిద్ధం చేశారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ కోడిపందేల‌కు అనుమతి ఇవ్వమంటూ ఖాకీలు హూంకరించినప్పటికీ ఖద్దరు నేత‌లు వారి ఆదేశాల‌ను లెక్కచేయలేదు. పోలీసు ఉన్న‌తాధికార‌లు మాత్రం వెనక్కి తగ్గబోమంటూ పొలిటికల్ లీడర్లకు సంకేతాలు ఇచ్చారు. దీంతో ఏం చేయాలో తెలియక చాలా మంది డైలమాలో పడ్డారు. అసలు పందేలు లేవని నిన్నటి వరకు అంతా అనుకున్నారు. రాత్రికి రాత్రే సీన్ మొత్తం మారిపోయింది. రాజకీయ నేతల హామీతో బరుల్లోకి పందేం కోళ్లు క‌త్తుల‌తో రంగంతో దిగ‌టానికి సిద్ద‌మైయ్యాయి. కోనసీమ వ్యాప్తంగా కోడి పందాలు జరగవని అంతా డిసైడ్‌ అయిన వేళ కోనసీమలోని ప్రజాప్రతినిధులు అత్యవసరంగా సమావేశమయ్యారని టాక్ నడుస్తోంది. పండుగ మూడు దినాలు పందేలు నిర్వహణ లేకుండా అడ్డుకట్టవేస్తే పార్టీ క్యాడర్ నుంచి కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుందని ప్రజాప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారట. ఓ మంత్రి అధ్యక్షతన ఈ భేటీ జరిగినట్టు సమాచారం. ఈ సమావేశానికి కోన‌సీమ శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారట. ఎట్టిపరిస్థితుల్లోనూ గతంలో మాదిరిగానే పందేలు జరుపాల‌ని స‌మావేశంలో తీర్మాణించిన‌ట్లు ఆధికార పార్టీ నేతలు తెగేసి చెప్పారు. అధిష్టానం నుంచి కోన‌సీమ నేత‌లకు సానుకూల సంకేతాలు రావడంతో అనుయాయులకు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వ‌టంతో భూమి పూజలు చేసి బరులు సిద్ధం చేసేశారు.
గ‌త 15 రోజులుగా కోడి పందాలు గుండాట్లను నియంత్రించేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. సాంప్రదాయ ముసుగులో పందాలకు తెరిలేపారు. నరసాపురం తీర ప్రాంతంలో విచ్చలవిడిగా కోడిపందాలు గుండాట మొదలయ్యాయి. నర్సాపురం మొగల్తూరు మండలంలో సుమారు 25కు పైగా బరుల్లో పందాలు జరుగుతున్నాయి. వీటిలో ఆరుకుపైగా పెద్ద బరువులు ఉన్నాయి. అన్ని బరువులు వద్ద నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. పోలీస్‌, రెవెన్యూ అధికారులు గ్రామంలో అవగాహన సదస్సు పెట్టి కోడిపందేలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిచారు. ఇదే సమయానికి అదే గ్రామంలో పోలీస్‌ సదస్సు పెట్టిన ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలో కోడిపందేల నిర్వాహకులు యథేచ్ఛగా బరులు సిద్ధం చేశారు. భారీ సెట్టింగ్‌లతో లక్షల రూపాయలు ఖర్చుతో కోడిపందాల బరులు సిద్ధం చేశారు. కోడి పందాల వీఐపీ పాస్ ధర 60వేలుగా నిర్ణయించారు. ఈ మేరకు నిర్వాహకులు వీఐపీ పాసులను సిద్ధం చేస్తున్నారు. గ్రేట్ ఏ, గ్రేట్ బిగా పాసుల ధరలను కోడి పందాల నిర్వాహకులు కేటాయించారు. గ్రేట్ ఏ 60వేలు, గ్రేట్ బి 40వేలుగా పిక్స్ చేశారు. వీఐపీ పాస్ తీసుకున్న వారికి మూడు రోజుల పాటు ఫుడ్, క్వాలిటీ లిక్కర్, బెడ్, కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆటగాళ్ల కోసం క్యూ ఆర్ కోడ్ పేమెంట్ సౌకర్యం కల్పిస్తున్నారు. పందేలు వీక్షించేందుకు అధికార పార్టీ నేతలు పాస్‌లు కూడ‌ జారీ చేస్తున్నారు. కోడి పందేల బరుల్లో గెలిస్తే బుల్లెట్‌ వాహనం, కారు బహుమతిగా ఇస్తున్నారు. ఒక్కో పందెంలో 10 లక్షల వరకు బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. పలు గ్రామాల్లో 3లక్షల నుంచి 5లక్షల వరకు మరికొన్ని గ్రామాల్లో10 నుంచి 25 లక్షల వరకు జూద నిర్వాహకులు గ్రామ స్థాయి నాయకుల వద్ద వేలం పాట పాడుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. కొన్ని గ్రామాల్లో మునుపెన్నడూ లేనంతగా కోడి పందేలు కోసం, పేకాట, నెంబరు గుండాటల కోసం ప్రత్యేక ప్రదేశాలు ఏర్పాటు చేశారు. రాత్రిబవళ్ళు లైటింగ్‌కు జనరేటర్లు ఏర్పాటు చేశారు. కోడిపందాలకు సంబంధించి ప్రజలు చూసేందుకు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే పోలీసులు హెచ్చరికలు షరా మామూలుగానే ఉన్నప్పటికీ… ఎస్పీ పని తీరు తెలిసిన వారంతా పందాలు జరగవనే అనుకున్నారు. అయితే పైస్థాయిలో ఒత్తిళ్లు తీవ్రతరం అవడంతో కోడిపందేల పట్లా చూసీ చూడనట్లుగా వ్యవహరించినప్పటికీ, గుండాటలపై గురిపెట్టే విధంగా సన్నద్ధమవుతున్నారు పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లోనూ బరుల వద్ద రికార్డింగ్‌ డ్యాన్స్‌లు కానీ, గుండాట, నిర్వహిస్తే ఊరుకోమని పోలీసులు హెచ్చరించినట్లు సమాచారం. కోనసీమలో దాదాపు 200 వరకు బరులు ఏర్పాటుకు సిద్ధమైనప్పటికీ పోలీసుల నుంచి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ఏం చేయాలో పాలు పోక ధైర్యం చేసి అడుగు ముందుకు వేయలేక ఇబ్బంది పడ్డారు. చివరకు పై స్థాయి నుంచి కోడిపందాలపై సానుకూలత వ్యక్తం కావడంతో ఆలస్యంగా కోడిపందాలు ప్రారంభమయ్యాయి. చాలా ప్రాంతాల్లో బరులు సిద్ధం చేసినప్పటికీ బరిలోకి కాలు పెట్టేందుకు ఒకింత భయపడే పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే పందేలు ప్రారంభమైన నేపథ్యంలో మిగిలిన బరులను కూడా చకచక ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. పోలీసు హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నడూ లేని విధంగా సాంప్రదాయ పేరుతో కోడిపందాలు ముసుగులో కోట్ల రూపాయలు చేతులు మారుతున్న‌ట్లు తెలుస్తోంది.. నిన్నటి వరకు ఎంతటి వారైనా అంతు చూస్తామని ప్రగల్పాలు పలికిన పోలీసులు కనుచూపుమే కాన రావడం లేదు. కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే కాకినాడ జిల్లాలో ఉదయం నుంచి పలుచోట్ల పందాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. తాళ్లరేవు మండలంలో పలుచోట్ల పందెం కోళ్ళు కాళ్లు దువ్వుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కోడిపందాలతోపాటు గుండాట, కోతాట, తదితర జుదాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. భారీ స్థాయిలో కోడిపందాలు నిర్వహించడంతో పందాల రాయులకు ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking