మహోద్యమానికి స్ఫూర్తినిచ్చిన కొమరయ్య అమరత్వం

 

కొమరయ్య స్ఫూర్తిగా ప్రజా ఉద్యమ నిర్మాణం

సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 03 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణలో నిజాం నవాబుల పాలన, దొరలు, దేశముఖ్ ఆగడాలు మితిమీరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో దొడ్డి కొమరయ్య అమరత్వం ఒక మహోద్యమానికి దారి తీసిందని చివరకు అది సువర్ణక్షర లిఖిత రైతాంగ సాయుధ పోరాటంగా రూపుదిద్దుకుందని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తెలిపారు. కొమరయ్య స్ఫూర్తిగా ప్రజా ఉద్యమాలకు నేటి తరం సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సాయుధ తెలంగాణ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా పోటు ప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటి జనగామ జిల్లా కడివెండి గ్రామంలో కొమరయ్య జన్మించారని ఆ గ్రామం విసునూరు దేశముఖ్ రామచంద్రారెడ్డి ఏలుబడిలో ఉండేదని ఆయన తెలిపారు. దొరలు, వారి అనుచరులు సాగిస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా అనేక మంది ఆంధ్ర మహాసభలో చేరారని ఆ వరుసలో దొడ్డి కొమరయ్య ఆయన సోదరుడు మల్లయ్య ఆంధ్ర మహాసభలో చేరి గ్రామానికి, గ్రామ ప్రజలకు అండగా ఉంటూ వారిని చైతన్యపరిచేవారన్నారు. కొమరయ్య సోదరుడు సాగిస్తున్న పోరాటం నలు దిశలు పాకి 60 గ్రామాల పరిధిలో ప్రజలు చైతన్యవంతులు అవుతుండడంతో కొమరయ్య సోదరులను అంతమొందించాలని దేశముఖు, నైజాం సైన్యం భావించిందని ఆ క్రమంలోనే మల్లయ్య, కొమరయ్యలపై కాల్పులు జరిపారని కాల్పుల్లో దొడ్డి కొమరయ్య మరణించారని ప్రసాద్ తెలిపారు. అప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్న సాయుధ తెలంగాణ పోరాటం కొమరయ్య మరణంతో ఉవ్వెత్తున ఎగిసిపడిందని సామాన్యులు సైతం సాయుధులై తిరుగుబాటు చేశారన్నారు. కొమరయ్య వీరత్వం, అమరత్వం తెలంగాణ నుండి నిజాం రాజును, దొరలను, దేశముఖ్ ను తరిమివేసిందని ప్రజలను మరిచి పాలన సాగిస్తున్న పాలకులను గద్దె దింపేందుకు నేటి తరానికి కొమరయ్య అమరత్వం స్ఫూర్తి కావాలని ప్రసాద్ పిలుపునిచ్చారు. కులం, మతం ఇప్పుడు రాజకీయ అంశాలుగా మారాయని మైనార్టీ, మెజార్టీ పేరుతో వివక్ష కొనసాగుతుందని దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన బహుముఖ పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఏప్రిల్ 14 నుంచి ఖమ్మంజిల్లాలో జరిగే సిపిఐ ప్రజా పోరు యాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి, పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, మేకల శ్రీనివాసరావు, ప్రజా సంఘాల బాధ్యులు తాటి నిర్మల, మల్లికార్జున్, ఇటికాల రామకృష్ణ, జాకీర్, బోడా వీరన్న, పూర్ణ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking