జర్నలిస్టు భళ్లమూడి రామకృష్ణ కు అక్షర నివాళి: ‘ద టైటాన్ అఫ్ ట్రూత్’ పుస్తక ఆవిష్కరణ

 

హైదరాబాద్: వృత్తి నిబద్ధత, మేధోశక్తి, విశ్లేషణ సామర్ధ్యంతో పాటు తెలుగు, ఆంగ్ల భాషల్లో విశేష పరిజ్ఞానం ఉన్న అరుదైన జర్నలిస్టు భళ్లమూడి రామకృష్ణ (ఆర్కే) అని సీనియర్ జర్నలిస్టులు, కమ్యూనికేషన్ నిపుణులు కొనియాడారు. తెలుగు, ఆంగ్ల జర్నలిజాలు కోల్పోయిన ఆణిముత్యంగా ఆయన్ను వారు అభివర్ణించారు.

2021 లో కొవిడ్ మహమ్మారికి బలైన ఆర్కే 57 వ జయంతి సందర్భంగా అయన స్మృత్యర్థం సోమవారం నాడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ‘ద టైటాన్ అఫ్ ట్రూత్’ పుస్తక ఆవిష్కరణ జరిగింది. పుస్తకాన్ని ఆవిష్కరించిన అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఏ టీ ఏ ఆర్ ఐ) ప్రిన్సిపాల్ సైన్టిస్ట్ డాక్టర్ జేవీ ప్రసాద్ మాట్లాడుతూ- వృత్తి నిబద్ధతతో పనిచేసి ఎందరో జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలిచిన రామకృష్ణ లేని లోటు తీర్చలేనిదని అన్నారు.
హాస్య బ్రహ్మ శంకర నారాయణ మాట్లాడుతూ- సాహితీ ప్రియత్వం, హాస్య ప్రియత్వం కలబోత రామకృష్ణ అని చెప్పారు. రామకృష్ణ తన లాంటి వారెందరికో వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ఎంతో మేలుచేశారని, వారి మరణాన్ని జీర్ణించుకోవడానికి తనకు ఏడాదిన్నర పట్టిందని ఆంధ్రప్రదేశ్ దేవాలయ పాలన సంస్థ మాజీ సంచాలకుడు ద్రోణంరాజు రామచంద్ర రావు చెప్పారు.
నాణ్యమైన జర్నలిజానికి రామకృష్ణ పర్యాయపదమని, తనతో పనిచేసిన ఎందరికో అయన మార్గనిర్దేశం చేశారని ప్రముఖ పర్సనాలిటీ డెవలప్మెంట్ నిపుణుడు, పోటీ పరీక్షల శిక్షకుడు ఆకెళ్ళ రాఘవేంద్ర గుర్తుచేసుకున్నారు. ఎంతో ప్రతిభావంతుడైన రామకృష్ణకు జర్నలిజం లో రావాల్సిన పదవులు రాలేదని ఈనాడులో డెస్క్ ఇంచార్జ్ గా పనిచేసి ప్రస్తుతం ఎన్ టీవీ ఎడిటర్ వి సుందర రామ శాస్త్రి చెప్పారు. ధాత్రి కమ్యూనికేషన్ అధిపతి పమిడికాల్వ మధుసూదన్ మాట్లాడుతూ-రాజకీయ విశ్లేషణా శక్తి, సినీ, సాహిత్య పరిజ్ఞానం, రచనా సామర్ధ్యం పుష్కలంగా ఉన్న అరుదైన జర్నలిస్టు రామకృష్ణ అని ప్రస్తుతించారు.
సీనియర్ జర్నలిస్టులు ప్రేమ, రాజేశ్వరి కళ్యాణం, డా. ఎస్ రాము, పెమ్మరాజు వెంకటేశ్వర రావు ఆర్కే తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఆర్కే తో అనుబంధాన్ని, అనుభవాలను గుర్తుచేసుకుంటూ పాతిక మంది జర్నలిస్టులు రాసిన వ్యాసాలతో పుస్తకాన్ని తెచ్చినందుకు ఆర్కే సతీమణి వందన ద్విభాష్యం, కుమార్తె లాస్య లను జర్నలిస్టులు అభినందించారు. వివిధ పత్రికలు, టీవీ ఛానెళ్ల లో పనిచేస్తున్న జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking