మత్తు మోజులో పడితే జీవితం నాశనం

– జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి
– యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా విద్యార్థుల చేత ప్రమాణం

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూన్ 26

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి అన్నారు. యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ఆయన బుధవారం పట్టణంలోని గాయత్రి డిగ్రీ, కాలేజీలో జీఎస్ఆర్ ఐటీఐ, స్రవంతి జూనియర్ కాలేజీ స్టూడెంట్స్‌కు డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన కల్పించారు. జీఎస్ఆర్ ఐటీఐ సంస్థ నిర్వాహకులు ముస్కే వీరరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐ రవి మాట్లాడుతూ సరదాగా మొదలైన మత్తు పదార్థాల వాడకం క్రమేణా వ్యసనంగా మారుతుందని చెప్పారు. యువతీ యువకులు మత్తు మోజులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలన్నారు. డ్రీమ్స్ ను చంపే మహమ్మారి డ్రగ్(డ్రగ్స్ ఎండ్ ఆల్ డ్రీమ్స్) అని వివరించారు. ఐటీఐ, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు చెడు తీపిగా అనిపించే ప్రమాదముందని, ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నొక్కి చెప్పారు. తమ తల్లిదండ్రుల కలలు నెరవేర్చడం కోసమే చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. తమ పిల్లలు ఉన్నతస్థాయికి వెళ్లాలని విద్యార్థుల తల్లిదండ్రులు చెమటోడ్చి ఎండనక, వాననక కష్టపడే సంగతిని విద్యార్థులు అనుక్షణం గుర్తు ఉంచుకోవాలని చెప్పారు. చెడు అలవాట్లు తమ దరి చేరకుండా స్టూడెంట్స్ జాగ్రత్తపడాలన్నారు. సిగరెట్లు, మత్తు పదార్థాల వంటివి అలవాటు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తారని, వాటిని అసలు తమ వద్దకు రానీయకుండా ముందుజాగ్రత్తతో విద్యార్థులు అప్రమత్తంగావ్యవహరించాలని వెల్లడించారు. డ్రగ్స్ కేసులో పట్టుబడితే మైనర్ అయినా కఠినతరమైన శిక్షలుంటాయని, 5 ఏండ్ల వరకు జైలు శిక్షతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు నమోదవుతాయాని వివరించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా విద్యార్థుల చేత జీఎస్ఆర్ ఐటీఐ ప్రాంగణంలో ప్రమాణం చేయించారు. అనంతరం జీఎస్ఆర్ ఐటీఐలో సీ ఐ ‘సే నో టు డ్రగ్స్’ అవగాహన పోస్టర్ ను అతికించారు.

     

Leave A Reply

Your email address will not be published.

Breaking