ఎం.ఎల్. సి.ఎన్నికల పోలింగ్ కొరకు సర్వం సిద్ధం

 

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 26 :
మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ నియోజకవర్గాల పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నికలలో భాగంగా ఈ నెల 27న పోలింగ్‌ నిర్వహణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లా అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌, మంచిర్యాల,బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాస్ రావు,హరికృష్ణ లతో కలిసి జిల్లాలోని నస్పూర్‌లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ శాసనమండలి సభ్యుల ఎన్నికల పోలింగ్‌ ఈ నెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని, ఇందు కొరకు ర్యాండమైజేషన్‌ లో కేటాయించిన ప్రకారంగా ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాలో 60 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 181 మంది పోలింగ్‌ అధికారులు,25 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించడం జరిగిందని తెలిపారు.పోలింగ్‌ రోజున పట్టభద్రుల ఎన్నికలో 19 వేల 41 మంది పురుషులు,11 వేల 880 మంది మహిళలు, ఉపాధ్యాయుల ఎన్నికలో 999 మంది పురుషులు, 665 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని, జిల్లాలో ఉపాధ్యాయ ఎం.ఎల్‌.సి. ఎన్నిక కొరకు 18 పోలింగ్‌ కేంద్రాలు, పట్టభద్రుల ఎం.ఎల్‌.సి.ఎన్నిక కొరకు 40 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో 8 కామన్‌ పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు,సిబ్బంది తమ విధులు బాద్యతాయుతంగా నిర్వహించాలని, జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking