హైదరాబాద్ జూన్ 9;క్రీడల్లో రాణించిన వారు ఏ రంగంపైన దృష్టి సారిస్తే, ఆ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించవచ్చు అని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు.సైక్లింగ్ క్రీడాకారుడు అన్నాడి మధుసూదన్ రెడ్డి ఇటీవల యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఆల్ ఇండియా 51 ర్యాంక్ సాధించడం, సెంట్రల్ ఆర్డ్మ్ రిజర్వు పోలీస్ విభాగంలో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాన్ని సాధించిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సైక్లింగ్ వేలోడ్రమ్ స్టేడియంలో ఆయనకు ఘనంగా సన్మానం జరిగింది.ఈ సందర్భంగా సాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ, మానసిక శారీరక దృఢత్వం కలిగి ఉండే క్రీడాకారులు ఏ రంగంలోనైనా అద్భుతమైన విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని దానికి నిదర్శనమే మధుసూదన్ రెడ్డి సాధించిన ఆల్ ఇండియా ర్యాంక్ అని ఆయన పేర్కొన్నారు.సైక్లింగ్ అకాడమీలో విద్యార్థిగా ఉంటూ ఒక ఐపీఎస్ అధికారి సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని క్రీడలతో పాటు చదువుపై దృష్టి సారించి, సివిల్ సర్వీసులో ఆల్ ఇండియా 51 ర్యాంకు సాధించడం రాష్ట్రంలోని వివిధ స్పోర్ట్స్ అకాడమీలు, స్పోర్ట్స్ స్కూళ్లలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకే కాకుండా తెలంగాణ గ్రామీణ యువతకు అందరికీ స్ఫూర్తి కలిగిస్తుందని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లా మారుమూల పల్లెలో పుట్టి, క్రీడల్లో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించి, అదే సమయంలో సివిల్స్‌పై దృష్టి పెట్టడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో మధుసూదన్ రెడ్డి తెలంగాణ గ్రామీణ క్రీడాకారులకు, యువతకు స్ఫూర్తి కలిగించేలా తన సేవలు అందించాలని ఛైర్మన్ ఆయనను కోరారు.ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ చంద్రారెడ్డి, స్టేడియం అడ్మినిస్ట్రేటర్ సుధాకర్ రావు, స్టేడియం సిబ్బంది, కోచ్‌లు, సైక్లింగ్ క్రీడాకారులు పలువురు పాల్గొన్నారు