తెలంగాణ సంక్షేమ సంబరాల్లో పాల్గొన్న రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి
జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి
కలెక్టర్ అమోయ్ కుమార్
నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్
అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు
అర్హులైన వారికి ఇళ్ళ స్థలాల పట్టాలు పంపిణీ – బీసీ కులవృత్తుల వారికి లక్ష రూపాయల ప్రొసీడింగ్ కాపీలు
రెండో విడత గొర్రెల పంపిణీ ప్రొసీడింగ్స్ అందచేత
మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి జూన్ 9: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఎంతో సుఖసంతోషాలతో ఉన్నారని ఈ విషయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో, సంక్షేమ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు వల్లే సాధ్యమైందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ సంబురాలు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు దాటి పదో యేట అడుగు పెడుతున్నామని ఈ పదేళ్ళ కాలంలోనే అంతకు ముందు సాధించని అద్భుతమైన అభివృద్ధి, ప్రగతిని సాధించినట్లు తెలిపారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి విషయంలో కంకణబద్దులై నిత్యం పరితపిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవడంతో పాటు ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారిందని ఇక్కడ అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేయడం మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని మంత్రి మల్లారెడ్డి వివరించారు. తెలంగాణ రాక ముందు మంచినీటి కోసం ఎంతో గోస పడ్డామని… ప్రస్తుతం కృష్ణా, గోదావరి జలాలను ఇంటింటికీ ప్రతినిత్యం సరఫరా చేస్తూ ఆడబిడ్డలకు ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరథ ద్వారా నీటిని అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నీరు, విద్యుత్తు, ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్ళలో ఇంగ్లీష్ బోధన, పల్లెప్రగతి, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, రైతులకు దళితబంధు, దళితబీమా అందచేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇన్ని కార్యక్రమాలు జరిగి పదేళ్ళ కాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించామని ప్రస్తుతం అందరూ సంతోషంగా, ఆనందంగా ఉన్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. విద్య బలోపేతానికి గురుకుల పాఠశాలలు,విదేశ విద్యకు 20 లక్షలు అందిస్తున్నదని అన్నారు. అదేవిధంగా రైతాంగానికి రైతు బందు, రైతు భీమా, సాగునీటికి చెక్ డ్యాంల నిర్మాణం, మిషన్ కాకాతీయ ద్వారా చెరువుల పూడిక తీత , పేదింటి ఆడపిల్లల కు కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ వంటి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని అన్నారు. ముఖ్యమంత్రికి ఆలోచన వచ్చిందే తడవు అడగకున్న పలు పధకాలు అమలుచేస్తున్న మనసున్న మారాజు అని కొనియాడారు. ఆర్థికంగా వెనుకబడిన దళితులకు దళిత బందు పధకం అమలు చేసినట్లే బి.సి. కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి కుటుంబంలో ఒకరికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు.
అలాగే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ల నిర్మాణాలు, పోలీసుల కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇండియాలోనే ఆదర్శ రాష్ట్రంగా తయారు చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందని మంత్రి మల్లారెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ఐదువందల మందికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద చెక్కులను మంత్రి తదితరులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద తన నియోకవర్గమైన మేడ్చల్లో ఇప్పటి వరకు రూ.34 కోట్లు ఆర్థిక సహాయం అందచేసి కార్పొరేట్ స్థాయిలో వైద్యచికిత్సలు చేయించడంతో పాటు అందరినీ ఆదుకొన్నామని మంత్రి మల్లారెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చాక అందిస్తున్న సంక్షేమ పధకాలు వాటి ద్వారా లబ్దిపొందిన విధానాలను లబ్ధిదారుల మాటల ద్వారా వింటుంటే వారి కళ్ళలో ఆనందం స్పష్టంగా కనిపిస్తున్నదని, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దక్షతకు నిదర్శనమని అన్నారు.
ఈ సందర్భంగా అర్హులైన వారికి ఇండ్ల పట్టాలను, రెండో విడత గొర్రెల పంపిణీ పథకం కింద ప్రొసీడింగ్ కాపీలు, వెనుకబడిన (బీసీ) కులవృత్తుల వారికి లక్ష రూపాయల ప్రొసీడింగ్ కాపీలను మంత్రి మల్లారెడ్డి, జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు అందచేశారు. రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) హబ్ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎంతగానో అభివృద్ధి చేశారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. దీనివల్ల ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి మల్టీ నేషనల్, నేషనల్ కంపెనీలు స్థాపించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని మంత్రి అన్నారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో దేశంలో ఎక్కడా చేపట్టని అభివృద్ధి జరుగుతుందని ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. పేదల సంక్షేమమే పరమావధిగా కేసీఆర్ నిత్యం ఆలోచిస్తూ ప్రతి గడపకు పధకం చేరేలా ,చక్కటి కార్యాచరణతో అమలు చేస్తున్నారని, నేడు రాష్ట్రంలో లబ్దిపొందని కుటుంబం లేదని అన్నారు. నాడు పేదలకు అరకొరగా అందుతున్న పధకాలు నేడు పధకాల అమలుతో పాటు తగిన బడ్జెట్ కేటాయిస్తూ అమలు చేస్తున్న తీరును ప్రజలకు వివరించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేర ఒక్కో రంగంలో సాధించిన ప్రగతిపై 21 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి స్పష్టం చేశారు.
నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్, మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకంటే ఎక్కువగానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో చేపడుతున్నారని ఇది ఎంతో గర్వకారణమని అన్నారు. రాష్ట్రంలో చేపట్టిన పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని ప్రకాశ్ తెలిపారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంఅవతరణ దశాబ్ధి వేడుకలు గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎంతో విజయవంతంగా నిర్వహించబడుతున్నాయని అన్నారు. ఈ విషయంలో అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే అధికారులు చేయడం జరుగుతుందని వారిని అభినందించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు నిర్వహించే సంబరాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొనేలా చేపడుతున్నామని ఈ విషయంలో ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి లబ్ధిపొందుతున్న పలువురితో అప్పటి పరిస్థితులు… రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడించారు. ఈ మేరకు వారు పొందుతున్న పథకాల గురించి లబ్ధిదారులు సభలో వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, మేయర్లు వెంకట్ రెడ్డి, కావ్య, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు,ఎంపీపీ లు, జడ్పీటీసీలు,కార్పొరేటర్లు, కౌన్సిలర్లు,ఎంపీటీసీలు, సర్పంచ్లు,కో అప్షన్ సభ్యులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.