మహాత్మా జ్యోతిబా ఫూలే సేవలు మరువలేనివి: అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 11:
మహాత్మా జ్యోతిబాపూలే 197 వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో బి .సి సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాలకు అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, ముఖ్యఅతిథిగా హాజరై మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ జ్యోతిబాపూలే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ముఖ్యం గా ఆడపిల్లల చదువు గురించి, ఆడవాళ్ళు చదువుకోవాలని, చదువు వల్లనే ఈ సమాజం లో ఆడపిల్లలకు భరోసా ఉంటుందని భావించి ఆ రోజుల్లోనే స్త్రీ విద్య కొరకు విశేష సేవలు అందించారన్నారు. జ్యోతిబాపూలే తన భార్యను మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తయారుచేసి మహిళా విద్యకు పాటుపడారని అన్నారు. వ్యక్తిగత జీవితాలను సమాజం కోసం త్యాగం చేసి నలుగురికి ఉపయోగపడే విధంగా మంచి పనులు చేసిన ప్రతి ఒక్కరు మహనీయులుగా కీర్తించబడుతున్నారని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. సుమారు 200 వందల సంవత్సరాలకు పూర్వం సమాజంలో అంటరానితనం, అవిద్య వంటి ఎన్నో సాంఘిక దురాచారాలను అప్పట్లోనే ఎదుర్కొని విద్య కోసం, ప్రత్యేకించి మహిళా విద్య, అంటరానితనాన్ని రూపుమాపేందుకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాపూలే అని అన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని ,మహాత్ముల జీవిత చరిత్రలను తెలుసుకొని వారి అడుగుజాడల్లో నడిస్తే మన జీవితాలకు సంతృప్తి కలుగుతుందని, వారి జీవిత ఆశయాలను నెరవేర్చడంలో నలుగురికి సహాయపడే అవకాశం కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమములో,బి సి సంక్షేమ శాఖ అధికారిణి జాన్సీ రాణి లా ఆఫీసర్ చంద్రావతి,కలెక్టరేట్ ఏఓ,వెంకటేశ్వర్లు,వి.వెంకట నర్సయ్య. అధ్యక్షులు,కల్లుగీత కార్మిక సంఘం,బి. రమేష్ దారి, అధ్యక్షులు విశ్వబ్రాహ్మణ సంఘం, యన్.భాస్కర్ ప్రజాపతి, కన్వీనర్, యం.బి.సి.సంఘం, జిల్లా బి.సి. ప్రతినిధులు, జిల్లా అధికారులు, బి.సి. సంక్షేమ వసతి గృహాల అధికారులు మరియు వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking