సీపీఎం జిల్లా ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయండి

సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి మార్చి 13

గత కార్యక్రమాలను సమీక్షించుకొని, భవిష్యత్తు కార్యాచరణ నిర్దేశించుకొనుటకు ఈనెల 29,30,31 తేదీల్లో ముకుంద లాల్ మిశ్రాభవన్లో నిర్వహించ తలపెట్టిన సీపీఎం పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు.
బుధవారం రోజున జమ్మికుంట జోన్ కమిటీ సమావేశం దండిగారి సతీష్ అధ్యక్షతన జరిగింది.దేశంలో, రాష్ట్రంలో పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, ప్రజలపై వాటి ప్రభావాలు, ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకునుటకు ఈ ప్లీనరీ సమావేశాలు తోడ్పడుతాయన్నారు. ఈ ప్లీనరీ సమావేశానికి రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారన్నారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ, దేశ సంపదను కార్పోరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్న బిజెపి అభ్యర్థులను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.
రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న విషయాన్ని రైతన్నలు ఇంకా మర్చిపోలేదని, 29 చట్టాలను 4లేబర్ కోడులుగా చేసి కార్మికుల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు.
నిరుద్యోగులకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బిజెపి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.స్విస్ బ్యాంకు లో ఉన్న నల్ల డబ్బులు తెచ్చి పేద ప్రజలకు పంచుతామన్నారని, వెనక్కి తెచ్చారా అని ఎద్దేవా చేశారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు.
2021లో జరపాల్సిన జనాభా లెక్కల సేకరణను వాయిదా వేయడమే కాకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుల గణనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని పేర్కొన్నారు.
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపైన, మహిళలపై దాడులు జరగని రోజు లేదని విమర్శించారు.
2014లో ఆకలి సూచికలో 125 దేశాల్లో 104వ దేశంగా ఉన్న భారతం దేశం నేడు 111వ స్థానానికి దిగజారిందని పేర్కొన్నారు. దేశంలో పెద్ద ఎత్తున పేదలు ఆకలికి అలమటిస్తున్నారనివారి సమస్యలు పరిష్కరించకుండా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని దుయ్యబట్టారు. పీడితుల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసేది కమ్యూనిస్టులేనన్నారు. కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగానే అనేక సంస్కరణలు, చట్టాలు వచ్చాయన్నారు
ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేస్తూ, ప్రజల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నదని, నియంతృత్వ చట్టాలను తీసుకొస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆస్తులు అన్ని అంబానీ, అదాని లాంటి కార్పొరేట్ కుబేర్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈసమావేశంలో పార్టీ జోన్ కార్యదర్శి శీలం అశోక్, కొప్పుల శంకర్, చల్ పూరి రాములు, జక్కుల రమేష్ యాదవ్, దండిగారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking