-ప్రభుత్వానికి నేతాజీ ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
న్యాయస్థానం ఆదేశాల మేరకు పారదర్శకంగా రీ సర్వే నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి అమీన్పూర్ నేతాజీ ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు, ఉపేంద్ర లు మాట్లాడారు. 1980 వ దశకంలో చిరు ఉద్యోగాలు చేసుకునే తామంతా బ్యాంకుల నుంచి రుణాలు పొంది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రామం సర్వే నెంబర్ 130 నుంచి 135 లలోని స్థలాలను కొనుగోలు చేశామని తెలిపారు. తమ స్థలాలకు సమీపంలో ఉన్న భూములను కొనుగోలు చేసిన కృష్ణంరాజు అక్రమంగా తమ స్థలాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ విషయమై తాము 2006 లో న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. విచారణ జరిపిన న్యాయస్థానం సమగ్ర సర్వే నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. కాగా నల్గొండ జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి ఒత్తిళ్లతో అధికారులు కబ్జా కు యత్నిస్తున్న వ్యక్తికి అనుకూలంగా సర్వే నిర్వహించారని ఆరోపించారు. శాశ్వత ల్యాండ్ మార్కింగ్ నుంచి నిర్వహించాల్సిన సర్వేను అందుకు విరుద్ధంగా నిర్వహించడంతో తాము అడ్డుకునేందుకు ప్రయత్నించామని తెలిపారు. కాగా స్థానిక పోలీసులు బాధితులైన తమనే అడ్డుకున్నారని వాపోయారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని ఎలాంటి ఒత్తిళ్లకు లొంగని అధికారిచే రి సర్వే నిర్వహించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే కుటుంబాలతో సహా ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని కన్నీరు మున్నీరు అయ్యారు.