• నూతనంగా నియామకమైన ఎం.బి.సి. కార్పొరేషన్ ఛైర్మన్ నందికంటి శ్రీధర్ అభినందన సభలో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు.
• ఎం.బి.సి. లకు ప్రత్యేకంగా ఆర్థిక చేయూత సీఎం కేసీఆర్ మానవీయతకు నిదర్శనం.
• బీసీ, ఎంబిసి లుగా గుర్తించి చేయూతనివ్వడం దార్శనిక దృష్టికి నిలువుటద్దం.
బీసీ లలో అత్యంత వెనుకబడిన వర్గాలను (ఎంబిసి లను) గుర్తించి ప్రత్యేకంగా చేయూతను అందించడం సీఎం కేసీఆర్ లోని మానవీయ ధృక్పదానికి నిదర్శనం అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఒక మేధర కులానికి చెందిన ప్రజా ప్రతినిధి అయిన నందికంటి శ్రీధర్ ను రాష్ట్ర ఎంబిసి ఆర్థిక సహకార కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించడం రాష్ట్ర ప్రభుత్వ ఉదాత్త లక్షణాన్ని కనబరుస్తుందని డాక్టర్ వకుళాభరణం అన్నారు. గురువారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నందికంటి శ్రీధర్ కు ఆత్మీయ సన్మానం జరిగింది. ఎం.బి.సి., డి.ఎన్.టి. సంఘాల ప్రతినిధులు ఈ అభినందన సభను సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, ఆత్మీయ అతిధులుగా కమిషన్ సభ్యులు సి.హెచ్. ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కె. కిశోర్ గౌడ్, రాష్ట్ర ఎం.బి.సి. అధ్యక్షుడు బెక్కం వెంకట్ లు పాల్గొని ప్రసంగించారు. సభాధ్యక్షులుగా మేధర సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మురళి కృష్ణ వ్యవహరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ… రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతున్నదని పేర్కొన్నారు. అమలులో ఉన్న ప్రతి సంక్షేమ పథకం పేద వర్గాల కుటుంబాలలో వెలుగును నింపుతున్నాయని అన్నారు. గత 10 ఏళ్ళలోపే పేద వర్గాల జీవన ప్రమాణాలలో ఊహించని ప్రగతి స్పష్టంగా అగుపించడం గమనించదగింది అన్నారు. సి.హెచ్. ఉపేంద్ర మాట్లాడుతూ… ఎంబిసి లుగా ‘A’ గ్రూపులోని 36 కులాలను ప్రత్యేకంగా గుర్తించి, జాబితా రూపొందించి పూర్తి శాతం గ్రాంట్ లతో ఆర్థికంగా ఆదుకోవడం రాష్ట్రంలో గొప్ప పరిణామం అన్నారు. శుభప్రద్ పటేల్ నూలి ప్రసంగిస్తూ… ఆత్మ గౌరవ భవనాలకు స్థలాలు, నిధుల కేటాయింపులు, విదేశీ విద్యానిధి, గురుకుల పాఠశాలలు నెలకొల్పి అనేక విధాలుగా వెనుకబడిన వర్గాలను ఎదిగించే కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శ ప్రభుత్వం అని పేర్కొన్నారు. కె. కిశోర్ గౌడ్ ప్రసంగిస్తూ… ఎంచుకున్న రంగంలో నిజాయితీగా, నిబద్దతగా కృషి చేస్తూ పోతూ ఉంటే గుర్తింపు అదే వస్తుంది అనడానికి బీసీ కమిషన్ తో పాటుగా పలు కార్పొరేషన్లకు జరుగుతున్న ఛైర్మన్ ఇతరత్రా పదవుల నియామకాలే అందుకు ఉదాహరణ అన్నారు. జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ… ప్రజాస్వామ్యం అంటే అన్ని వర్గాలకు సమ న్యాయం, సామాజిక న్యాయం సమపాళ్ళలో అందజేయడం అన్నారు. సీఎం కేసీఆర్ పదవుల ఎంపికలలో పాటిస్తున్న విధానం భవిష్యత్ లో కూడా పాటించదగిన ఒక స్పూర్తివంతమైన తీర్పుకు బాటలు వేశారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎం.బి.సి. అధ్యక్షుడు బెక్కం వెంకట్, బీసీ సమాజ్ అధ్యక్షుడు సంగ్యం సూర్యారావు, వీరభద్రీయ సంఘం నాయకుడు వీరాస్వామి, సంచార కులాల సంఘం జాతీయ అధ్యక్షుడు. నరహరి, మేధర సంఘం రాష్ట్ర నాయకులు ప్యారసాని బాలరాజ్, వెంకట రాములు, ఆర్యకటిక సంఘం నాయకుడు నేతీకార్ ప్రేమ్ లాల్, గంగిరెద్దుల సంఘం నాయకుడు నరసింహం, మేరు సంఘం నాయకుడు మాధవ్, వివిధ బీసీ, ఎం.బి.సి. ప్రజా, కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఈ అభినందన సభలో పాల్గొని ప్రసంగించారు, నందికంటి శ్రీధర్ ను అభినందించారు.