వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మే 23:
కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు.
గురువారం రోజున ఘట్కేసర్ మండలం,ఎదులాబాద్,మాదారం గ్రామాలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ సందర్శించారు. ఐపీకే ద్వారా నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి అక్కడ రైతులకు అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని,సేకరించిన ధాన్యం వెంటనే లారీలలో లోడ్ చేయించి ఎప్పటికప్పుడు నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించాలన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తరలింపులో జాప్యానికి తావు లేకుండా చూడాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా తార్పాలిన్ ,గన్ని బ్యాగులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు వర్షాల వల్ల ధాన్యం తడిసిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని అధికారులు వరకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థ వంతంగా నిర్వహిస్తూ తుది దశకు చేర్చాలని అన్నారు. ఇదే స్ఫూర్తితో పని చేస్తూ పూర్తిస్థాయి లక్ష్యానికి అనుగుణంగా దాన్యం సేకరణ జరపాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపు జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.