జీహెచ్‌ఎంసీ కార్మికులు, సిబ్బంది ఆరోగ్యం కోసమే వైద్య శిబిరం

 

– వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

– హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
– మీ ఆరోగ్యమే మా బాధ్యతగా భావించి ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నాం:జీహెచ్‌ఎంసీ కార్మికులు,ఉద్యోగులను ఉద్దేశించి మేయర్ గద్వాల విజయలక్ష్మి

– పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సిటీ బాగుంటుంది: కమిషనర్ ఆర్ వి కర్ణన్

హైదరాబాద్ 23, జులై,2025:

జీహెచ్‌ఎంసీ కార్మికులు, సిబ్బంది ఆరోగ్యం పెంపొందించేందుకే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సూచనల మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణకాంత్ పార్క్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కార్మికులు, ఉద్యోగులు, పొదుపు సంఘాల సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ప్రారంభించారు.

అనంతరం మంత్రి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం కార్మికులకు హెల్త్ కిట్‌లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…
హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆసుపత్రులకు వెళ్లకుండానే అవసరమైన పరీక్షలు, మందులు అందించేలా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర రాజధానిలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో జిల్లా రెవెన్యూ, మున్సిపల్, వైద్య సిబ్బంది కలిసి ఈ ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేదుకు 169 బస్తీ దవాఖానలు, 91 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 11 స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

30 ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, ghmc కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది, పొదుపు సంఘాల సభ్యులు ఉచిత పరీక్షలు తప్పనిసరిగా చేసుకుని అవసరమైన మందులు పొందాలని చెప్పారు. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు ఈ శిబిరాలు ఉపయోగపడతాయనీ మంత్రి పేర్కొన్నారు.

పేదల సంక్షేమం కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. గ్రేటర్ పరిధిలో 53 వేల రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. వీటి వల్ల 2 లక్షల 31 వేల మందికి ప్రయోజనం కలుగుతుందనీ అన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా అమలు అవుతుందన్నారు. ఇప్పటి వరకూ 200 కోట్ల జీరో టికెట్ ల మైలు రాయిని దాటిందని అన్నారు. తద్వారా 6,700 కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా చేశారని అన్నారు.
గురుకులాల్లో నాణ్యమైన ఆహారం కోసం మెస్ చార్జీలు పెంచామని తెలిపారు. యువతకు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. రానున్న రోజుల్లోనూ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుంది” అని అన్నారు.

మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ…
జీహెచ్‌ఎంసీ కార్మికులు, ఉద్యోగులు, పొదుపు సంఘాల సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, గ్రేటర్ హైదరాబాద్‌లోని 30 సర్కిల్‌లలో ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని మేయర్ తెలిపారు. కార్పొరేటర్లు కోరితే డివిజన్ స్థాయిలో కూడా శిబిరాలు నిర్వహిస్తామన్నారు. “కొందరు మహిళా కార్మికులు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ప్రతి మహిళా ఉద్యోగి తప్పనిసరిగా గైనకాలజీ, సీజనల్ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాధులను ప్రారంభంలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలి” అని ఆమె సూచించారు.


కమిషనర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ..
క్షేత్ర స్థాయిలో ఫ్రంట్ లైన్ లో ఉంటూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేది కార్మికులేనని అన్నారు. అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నారు. పారిశుద్ధ్య కార్మికులు
బాగుంటేనే సిటీ బాగుంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేసుకునేందుకు ముందుకు రావాలన్నారు. ఈ వైద్య శిబిరాల ద్వారా బేసిక్ నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుందన్నారు. ఈ శిబిరాల్లో కార్మికుల ఆరోగ్యాన్ని కాంక్షించి అందిస్తున్న కిట్స్ ను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ ప్రత్యేక వైద్య శిబిరాలకు మంచి స్పందన లభించింది. జీహెచ్‌ఎంసీ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, కార్పొరేటర్లు, అజారుద్దీన్, నవీన్ యాదవ్ , అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking