గిరిజనల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తుంది మంత్రి పువ్వాడ

ఖమ్మం ప్రతినిధి జూన్ 17 (ప్రజాబలం) ఖమ్మం గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నదని, తండాలకు పంచాయతీల హోదాతో గిరిజనులకు పాలనాధికారం కల్పించిన ఘనత సిఎం కేసీఅర్ దేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం గిరిజన దినోత్సవం సందర్భంగా రఘునాథపాలెం మండలం లచ్చిరాం తండా, దొనబండ, మంగ్య తండా, కెవి బంజర, మూలగూడెం గ్రామం, ఎన్ వి బంజర, రజబ్ అలీ నగర్ గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి, ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు చొప్పున మొత్తం రూ.1.40 కోట్ల విలువైన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో గిరిజన మహిళలు తమ సంప్రదాయ నృత్యాలతో మంత్రి పువ్వాడకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రజబ్ అలీ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, తండాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించి బంజారాల చిరకాల వాంఛను నెరవేర్చారని, దీనివల్ల తండాలను గిరిజనులే సర్పంచులు, వార్డ్ మెంబర్లుగా ఎన్నికై పాలించుకుంటున్నారని తెలిపారు. రఘునాథపాలెం మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిని 37 గ్రామాలకు పెంచుకున్నామని, వాటిలో 20 తండాలను కొత్త గ్రామాలుగా మార్చి స్వయం పాలనా చేసుకునే విధంగా అవకాశం కల్పించడం జరిగిందన్నారు. నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన తండాలలో రూ. 20 లక్షల చొప్పున నిధులతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనాలు అభివృద్ధికి బాటలు వేస్తాయని మంత్రి తెలిపారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, హైద్రాబాద్ లో బంజారా లకు ఆత్మగౌరవం కల్పించే విధంగా ప్రభుత్వం బంజారా భవన్ నిర్మిస్తున్నదని, గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. అడవి బిడ్డలైన బంజారాల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్, వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. ప్రతి తండాకు రోడ్డు సదుపాయం ఏర్పడిందని, 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న గిరిజన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అమలవుతోందని గుర్తు చేశారు. అన్నింటికి మించి గిరిజన బిడ్డలకు అధునాతన సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యా బోధన అందాలనే తాపత్రయంతో కొత్తగా ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.  ప్రభుత్వ సంకల్పంతో ప్రస్తుతం ప్రతి ఏటా సుమారు లక్ష మంది వరకు గిరిజన బిడ్డలు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆరు శాతానికి పరిమితమైన గిరిజన రిజర్వేషన్ ను జనాభా ప్రాతిపదికన పది శాతానికి పెంచిన ఫలితంగా విద్యా, ఉద్యోగావకాశాలు మెరుగుపడ్డాయని అన్నారు. అన్నింటికీ మించి గిరిజన తండాల్లోని ప్రతి గుడిసె, ప్రతి ఇంటికి ప్రభుత్వం కుళాయిల బిగించి మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తోందని, దీనివల్ల అడవి బిడ్డలకు విష జ్వరాలు, అనారోగ్యాల బారిన పడే పరిస్థితి దూరమయ్యిందని అన్నారు. గ్రామ పంచాయతీలకు నేరుగా నెలనెల నిధులు మంజూరు చేస్తూ మన గ్రామాలను మనమే అభివృద్ధి చేసుకునే సౌలభ్యం కలిగిందన్నారు. నేడు గ్రామాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందాయని, గ్రామాల్లో రోడ్లు, మంచినీరు, విద్యుత్, ప్రాథమిక విద్యా, ప్రాథమిక ఆరోగ్యం వంటి అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. నేడు గ్రామాలు పట్టణాలతో అభివృద్ధితో పోటీపడుతున్నాయని, అభివృద్ధి చెందిన గ్రామ పంచాయతీలను కేంద్ర ప్రభుత్వమే గుర్తించి అవార్డులు అందజేస్తున్న స్థాయికి మన గ్రామాలు ఎదిగాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అత్యధిక నిధులు కేటాయిస్తూ, అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు మంత్రి అన్నారు. గ్రామాలలో మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు, గ్రామ గ్రామాన వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి వాటిని పూర్తి చేసిందన్నారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఏజెన్సీ మారుమూల గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. మారుమూల గ్రామాలలో సైతం రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు కోట్లాది రూపాయల నిధులను కేటాయించిందన్నారు.

అనంతరం గిరి వికాస్ పథకం ద్వారా రైతులకు వంద శాతం సబ్సిడీతో మోటార్ లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, జెడ్పి సిఇఓ అప్పారావు, డీఆర్డీఓ విద్యాచందన, పీఆర్ ఇఇ కెవికె శ్రీనివాస్, రఘునాథపాలెం ఎంపిపి గౌరీ, జెడ్పిటిసి ప్రియాంక, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking