ఖమ్మం ప్రతినిధి జనవరి 4 (ప్రజాబలం) ఖమ్మం పామాయిల్ కర్మాగారం నిర్మాణ పనులు సంవత్సరం లోగా పూర్తి చేయాలని, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం మంత్రి కొనిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామం అంజనాపురం లో గోద్రెజ్ కంపెనీ చే నిర్మించ తలపెట్టిన పామాయిల్ కర్మాగార స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ. 275 కోట్ల పెట్టుబడితో గోద్రెజ్ కంపెనీచే పామాయిల్ కర్మాగారం జిల్లాలో నిర్మిస్తున్నారని తెలిపారు. కర్మాగారం, విత్తన గార్డెన్, రిఫైనరీ, నర్సరీల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కర్మాగారం, ఇతర అవసరాల కొరకు 180 ఎకరాల స్థలం అవసరం కాగా, 113.15 ఎకరాల స్థల సేకరణ జరిగినట్లు ఆయన అన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన రైతులతో మంత్రి సంభాషించారు. ఆయిల్ పామ్ సాగుతో మంచి లాభాలు ఉన్నాయని, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్, కొనిజర్ల ఎంపిపి మధు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.