ఆరోగ్య మ‌హిళ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి. ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మ‌ల్ / ల‌క్ష్మ‌ణ‌చాంద‌, సెప్టెంబ‌ర్ 12: వైద్య, ఆరోగ్య రంగంలో దేశానికి తెలంగాణ దిక్సూచిలా మారిందని, ప్రభుత్వాసుత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తున్నట్లు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. మంగ‌ళ‌వారం ల‌క్ష్మ‌ణ‌చాంద మండ‌ల కేంద్రంలో ఆరోగ్య మ‌హిళ కేంద్రాన్ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..పేదలకు స్పెషాలిటీ సేవలు అందించడంతోపాటు, డాక్టర్‌ కావాలనుకునే విద్యార్థుల కలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్‌ జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేశారన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా ద‌వ‌ఖానాల్లో తీవ్రంగా వైద్యులు, సిబ్బంది కొర‌త ఉండేద‌ని, క‌నీస వ‌సతులు, మందులు కూడా అందుబాటులో ఉండేవి కావ‌ని, అనేకచోట్ల నర్సులు, కాంపౌండర్లే వైద్యం అందించిన దుస్థితి ఉండేద‌ని, కానీ తొమ్మిదేండ్లలో ప్రభుత్వ దవాఖానల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మార్గనిర్దేశనంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్యక్రమాలు, మానవీయ పథకాలు ప్రజావైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయన్నారు. క్షేత్రస్థాయిలో బస్తీ దవాఖానలు, సబ్‌సెంటర్లు, పీహెచ్‌సీల్లో ఉత్తమ వైద్య సేవలు అందుతున్నాయ‌ని పేర్కొన్నారు.
జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుతో కార్పోరేట్ హాస్పిట‌ల్స్ కు ధీటుగా స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయని, ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రజలకు అత్యాధునిక సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందుతున్నాయని వివ‌రించారు. జిల్లాకో మెడిక‌ల్ కాలేజ్ మంజూరైంద‌ని, దీంట్లో భాగంగా నిర్మ‌ల్ జిల్లాలో కూడా వైద్య క‌ళాశాల ఏర్పాటైంద‌ని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ ఈ ఏడాది మార్చి 8న ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టార‌ని, ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా 272 ఆరోగ్య మ‌హిళ కేంద్రాల‌ను ఏర్పాటు చేశార‌న్నారు. వీటిని మరో 100 వ‌ర‌కు విస్తరించాలని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన నేప‌థ్యంలో ఇవాళ ఆరోగ్య మ‌హిళ కేంద్రాన్ని ప్రారంభించుకున్నామ‌ని తెలిపారు.
ప్ర‌తీ మంగ‌ళ‌వారం మ‌హిళ‌లకు ఈ కేంద్రాల్లో 8 ర‌కాల ఉచిత‌ ప‌రీక్ష‌లు చేసి వైద్యం అందిస్తార‌ని వెల్ల‌డించారు. ఇక్కడ పరిష్కారంకాని సమస్యలను జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలకు రెఫర్‌ చేస్తారని, అక్కడ మహిళల కోసం ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌, ప్రత్యేక వార్డు ఉంటుందని వివరించారు. గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదలు వైద్య పరీక్షలు చేయించుకోలేని స్థితిలో ఉన్న మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మ‌హిళ‌లు ఆర్థిక ఇబ్బందులు, చెప్పుకోవడానికి ఇష్టం లేక, చికిత్స కోసం వెళ్లే తీరిక లేక వ్యాధుల గురించి వారు పట్టించుకోవడం లేద‌ని, దీనిని దృష్టిలో పెట్టుకుని, ఆడబిడ్డల ఆరోగ్యమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళ పథకానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ఆరోగ్య మహిళ’ ద్వారా ఏర్పాటు చేసిన దవాఖానల్లో అటెండర్‌ నుంచి డాక్టర్‌ వరకు అందరూ మహిళలే ఉంటారని, నిర్భయంగా వెళ్లి తమ ఆరోగ్య సమస్యలు చెప్పుకోవచ్చని సూచించారు.
అంత‌కుముందు హ‌రిత‌హార కార్య‌క్ర‌మంలో భాగంగా ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో మంత్రి మొక్క‌లు నాటారు.
8 ర‌కాల సేవ‌లు ఇవే.
మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు; ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్;
థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం; అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు.
మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు.
మోనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్‌తో అవగాహన కలిగిస్తారు.
నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యే కంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.
సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు.
బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking