అంగన్‌వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠాలు మంత్రి సీతక్క

ప్రజా బలం ప్రతి నిధి ములుగు జిల్లా జులై 12 :

అంగన్‌వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠాలు బోధించనున్నట్లు మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచేందుకు ‘అమ్మ మాట- అంగన్‌వాడీ బాట’ పేరుతో జులై 15 నుంచి వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బుధవారమిక్కడ అంగన్‌వాడీ కేంద్రాలు, మహిళా భద్రత, దత్తత, చైల్డ్‌కేర్‌ అంశాలపై శిశు సంక్షేమశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్‌ కాంతివెస్లీతో కలిసి జిల్లా సంక్షేమాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా యునెస్కో సహకారంతో రూపొందించిన న్యూట్రిషియన్‌ ఛాంపియన్‌ పుస్తకం, న్యూట్రిషియన్‌ కిట్లను ఆవిష్కరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నాసిరకం సరకుల కట్టడికి క్షేత్రస్థాయి అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆమె ఆదేశించారు. ‘‘రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలి. భవనాలకు పెయింటింగ్‌ పనులు త్వరగా పూర్తిచేయాలి. చిన్నారులకు దేశంలోనే తొలిసారిగా త్వరలో యూనిఫాంలు అందిస్తాం. తెలంగాణను పోషకాహారలోప రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. మహిళలు, చిన్నారులపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking