అధికారులకు సెలవులు రద్దు..

24 గంటలు అప్రమత్తంగా ఉండండి…

కంట్రోల్ రూం ఏర్పాటు ( ‌9391942254 )

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజాబలం – మెదక్ జిల్లా ప్రతినిధి 2 సెప్టెంబర్ 2024 :

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అధికారులు సెలవులు రద్దు చేశామని .. 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు.
మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ప్రమాదకరంగా ప్రవహించే వరదల్లో, చెరువులు, కాలువలు వద్దకు ఎవరు వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. పోలీసులు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను సురక్షితంగా కాపాడాలని కోరారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి..

వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తతతో ఉంటే ప్రజల ఇబ్బందులు తగ్గించొచ్చు. భారీ వర్షాల నేపథ్యంలో ఇరిగేషన్, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని పరిశీలించాలి. పట్టణాల్లో రోడ్లపై నీరుచేరి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాలి. అదే విధంగా వర్షాల సమయంలో వైరల్ ఫీవర్, విషజ్వరాలు ప్రబలకుండా వైద్యఆరోగ్య శాఖ చర్యలు చేపట్టాలి‌.

అనవసరంగా బయటకు రావొద్దు..

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా కలెక్టర్ ప్రజలకు కీలక సూచనలు చేశారు.ఎవరూ కూడా అవసరం లేకుండా బయటకు రావొద్దని సూచించారు. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్ మెసేజ్‌లు గమనించి తగిన రక్షణ చర్యలు తీసుకుంటుందన్నారు. వర్షాలు పడుతున్న సమయంలో చెట్ల కింద, మైదాన ప్రాంతాల్లో ఉండటం చేయొద్దన్నారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌

కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొకునేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ ( ‌9391942254 )కు ఫోన్‌ చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking