సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 09 : మహాత్మా ఫూలే అందించిన బహుజన సంస్కృతిని బీసీ,ఎస్సీ, ఎస్టీ, బహుజన వర్గాల ప్రజలందరూ ఆచరించాలని సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం పిలుపునిచ్చారు. మంగళవారం రోజున మంచిర్యాల పట్టణంలోని బీసీ భవన్ లో జరిగిన “ఫూలే ఉగాది సంబరాల” లో వివిధ సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు.ప్రకృతిలో జరిగే మార్పులకు సూచనగా ఉగాది పండుగను స్వీకరించి బహుజన సంస్కృతి లో పండుగ జరుపుకోవాలని వారు కోరారు.బహుజన వర్గాల శ్రమతోనే ప్రపంచం నడుస్తుందని.. మనువాదులు ప్రవచించే మంత్రాలు,పంచాంగాలతో కాదన్న సత్యాన్ని నేటి ప్రజలు గుర్తించాలని వారు పిలుపునిచ్చారు. ఆధిపత్య వర్గాల సంస్కృతిని కూలదోసి ఫూలే అంబేడ్కర్లు చూపిన బాటలో శ్రామిక వర్గ సంస్కృతిని నిలబెట్టాలని వారు కోరారు.భవిష్యత్తులో జరగబోయేది ఎవరు చెప్పలేరని.. పంచాంగం పేరుతో మూఢా చారాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని వారు కోరారు.గ్రహాలు,నక్షత్ర ఫలాలు అనే తప్పుడు మాటలని నమ్మకుండా, కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్న సత్యాన్ని అందరూ గుర్తించాలని వారు తెలిపారు.బహుజన వర్గాలే సమస్త సంపద సృష్టికర్తలని,వారు ఆత్మాభిమానాన్ని సంతరించుకుని మనువాదుల ముందు మోకరిల్లడం మానుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కార్యదర్శి డూర్కె మోహన్, బీసీ ఐక్యవేదిక నాయకులు కనుకుంట్ల మల్లయ్య,గాండ్ల తిలకేశ్వర సంఘం అధ్యక్షులు బుద్ధి చంద్రమౌళి,బహుజన ఐక్యవేదిక నాయకులు పలిగిరి కనక రాజు,బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి కన్వీనర్ మోతె రామదాసు,సింగరేణి ఐక్యవేదిక నాయకులు పెద్దపల్లి కోటిలింగం, సామాజిక ఉద్యమ కారులు కామిల్ల జయరావు, శ్రీరామోజు కొండయ్య, కైలాసం,జెట్టి చరణ్ తదితరులు పాల్గొన్నారు.