ముదిరాజ్ లపై రాజకీయ కక్ష తగదు

— రాజకీయ అవకాశం ఇచ్చిన పార్టీలకే మా ప్రాధాన్యత
— విలేకరుల సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 22 (ప్రజాబలం) ఖమ్మం పోరాడి సాధించుకున్న తెలంగాణలో బీసీలలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ లపై రాజకీయ కక్ష తగదని, ఏ రాజకీయ పార్టీ అయితే ముదిరాజ్ లకు రాజకీయ అవకాశాలు ఇస్తుందో ఆ పార్టీకి ప్రాధాన్యత కల్పించి గెలిపించుకుంటామని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు ముదిరాజ్ అన్నారు.

మంగళవారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు ముదిరాజ్ మాట్లాడుతూ… పోరాడి సాధించుకున్న తెలంగాణలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, అగ్రకులాల వారికి 50% కంటే ఎక్కువ సీట్లు కేటాయించి, 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలను తక్కువ సీట్లు కేటాయించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఓట్లు వేయడానికి కానీ సీట్లు ఇవ్వడానికి పనికిరామా అని విమర్శించారు. అడుక్కునే స్థాయిలో ఉన్నంతకాలం అట్టడుగు స్థాయిలోనే ఉంచుతారన్నారు. తెలంగాణ సాధనలో 13 మంది ముదిరాజు బిడ్డలు అమరులయ్యారని, పోలీస్ కృష్ణ అన్నను ఏమాత్రం గుర్తించడం లేదన్నారు. కెసిఆర్ ప్రకటనలో ఒక్క ముదిరాజ్ కూడా లేకపోవడం దారుణమన్నారు. బీసీలలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ లను విస్మరిస్తే తగిన గుణపాఠం తప్పదు అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయితే ముదిరాజ్ లకు సీట్లు కేటాయిస్తుందో ఆ పార్టీలను ఆదరించి గెలిపించుకుంటామని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముదిరాజ్ లు ఐక్యంగా ఉండి సమస్యల సాధనకు కలసి రావాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో యూనియన్ నాయకులు కొప్పెర జానకిరాములు, పగడాల అనంతరాములు, బొమ్మకంటి సైదులు, దంతాల కేశవరావు, పడిశనబోయిన రమేష్, చింతల వెంకన్న, వెంగంపల్లి సురేష్, పొన్నెబోయిన సాయి, కుడితి సురేష్, దంతాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking