ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 23 : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల,బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు వి.రాములు, హరికృష్ణ,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన ఈర్ల ప్రభాకర్ తాను గ్రామ పంచాయతీలో గతంలో కారోబారుగా పని చేశానని, కుటుంబ కారణాలతో అధికారుల అనుమతితో విధులకు హాజరు కాలేకపోయానని,తనకు తిరిగి అవకాశం కల్పించి ఆదుకోవాలని కోరుతూ అర్జీ సమర్పించారు. నస్పూర్ మండలం శ్రీరాంపూర్ కు చెందిన బొద్దుల రాజయ్య తాను దాదాపు 50 సంవత్సరాలుగా కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నానని,వృద్ధాప్య కారణంగా పనిచేయలేక కుటుంబ పోషణ భారంగా మారిందని,నిరుపేద అయిన తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన బాలకృష్ణ తాను ముటేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్నానని ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. హాజీపూర్ మండల కేంద్రానికి చెందిన పాముల పద్మ తన తండ్రి నుండి తనకు సబ్బపల్లి శివారులో సంక్రమించిన భూమికి హద్దులు నిర్దారించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.మంచిర్యాల పట్టణానికి చెందిన బైరి సత్యనారాయణ తనకు కేటాయించిన మీ-సేవ కేంద్రాన్ని వేరే ప్రాంతానికి మార్చేందుకు అనుమతించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.నెన్నెల మండలం గుండ్ల సోమారం గ్రామానికి చెందిన డి.లక్ష్మి తనకు గ్రామ శివారులో గల భూమికి పట్టా పాస్ పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.కాసిపేట మండలం పెద్దన్నపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ గౌస్ తనకు గ్రామ శివారులో గల భూమిని ఇతరులు కబ్జా చేసి అక్రమంగా పట్టా మార్పు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయమై విచారణ చేసి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.కన్నెపల్లి మండలం చింతపూడి గ్రామానికి చెందిన వెన్నెల తమ గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలలో సహాయక సిబ్బందిని నియమించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కాసిపేట మండలం దుబ్బగూడం గ్రామానికి చెందిన దుర్గం తార తనకు దుబ్బగూడెం,పెద్దనపల్లి గ్రామ శివారులలో ఉన్న భూమి ఓపెన్ కాస్ట్లో పోతుందని,తనకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.కోటపల్లి మండలం కొల్లూరు గ్రామానికి చెందిన తాడూరి సమ్మగౌడ్ వృద్దాప్య పింఛన్,జంగం భారతి, తాడూరి ప్రమీల వితంతు పెన్షన్ ఇప్పించాలని కోరుతూ వేరువేరుగా దరఖాస్తు అందజేశారు.నెన్నెల మండలం గన్ పూర్ గ్రామానికి చెందిన కొమ్ము రాజయ్య తనకు సంబంధించిన భూమిపై కోర్టులో కేసు కొనసాగుతుందని,ఇట్టి భూమికి ఎలాంటి పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయకుండా నిలుపుదల చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ప్రజావాణి కార్యక్రమంలో 35 దరఖాస్తులు అందాయని,ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.