– యువకుడిని అభినందిస్తున్న గ్రామస్తులు
– సేవామార్గంలో ముందుకెళ్తున్న ‘మద్దుల’
– ఒక్కొక్కటిగా పలు కార్యక్రమాల నిర్వహణ
– కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో నిత్యావసరాల అందజేత
– సీజనల్ డిసీజెస్ నేపథ్యంలో ‘ఉచిత వైద్య శిబిరం’ ఏర్పాటు
హుజురాబాద్ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 10
‘‘సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుపడవోయ్’’ అనే మాటలను ఆదర్శంగా తీసుకున్న ఓ యువకుడు తన శక్తి మేరకు పనులు చేస్తున్నారు.
ఊరి బాగు కోసం ఆలోచనలు చేస్తూ..రంగంలోకి దిగి అడుగులు వస్తూ ముందుకు సాగు..తూ గ్రామస్తుల ప్రశంలు అందుకుంటున్నారు ఓ యువకుడు. రెండు పదుల వయసులోనే నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల అందజేత నుంచి మొదలుకుని సీజనల్ డిసీజెస్ నేపథ్యంలో ఇటీవల ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు వరకు తన వంతుగా పలు కార్యక్రమాలు చేపట్టారు ఆ యువకిశోరం. ఉన్న ఊరికి సేవ చేయడంలో ముందుంటున్న సదరు యువకుడు ఇంకెవరో కాదడోయ్.. వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లి గ్రామానికి చెందిన మద్దుల ప్రశాంత్ పటేల్.
తోచినంతలో.. శక్తి మేరకు ప్రశాంత్ అడుగులు
ప్రస్తుత సమాజంలో సామాజిక స్పృహతో ఉండటం గొప్ప విషయమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉరుకుల పరుగుల జీవనంలో.. స్వార్థపూరిత ప్రపంచంలో తమ మేలు, అభివృద్ధి కోసం మాత్రమే ఆలోచనలు, పనులు చేస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో తనతో పాటు తన ఊరు బాగుండాలని ఆలోచనతో తన శక్తి మేరకు ప్రశాంత్ మద్దుల పలు పనులు చేస్తున్నారు. ఉన్న ఊరికి సేవ చేయడమంటే కన్నతల్లికి సేవ చేయడమనే భావనతో ప్రశాంత్.. ఆది నుంచి ప్రజాసేవలో ముందుంటున్నారు.

కరోనా సమయంలో నిత్యావసరాల అందజేత
ప్రపంచాన్నే గడగడలాడించి.. అతలాకుతలం చేసిన కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఊరు, ప్రజల శ్రేయస్సు కోసం ప్రశాంత్ పటేల్ మద్దుల..నాడు పలువురికి నిత్యావసర వస్తువులను అందజేశారు. తన సొంత ఖర్చుతో సామగ్రి అందజేయడానికి ముందుకొచ్చి శభాష్ అనిపించుకున్నారు. దానితో పాటు గ్రామంలో చనిపోయిన పేదవారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి..పలు కుటుంబాలకు అండగా నిలిచారు. యువతకు వాలీబాల్ కిట్ అందజేసి.. తనలోని క్రీడాభిమానిని ప్రదర్శించారు.
ఊరిప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం
‘‘మానవసేవ-మాధవసేవ’’ అని మాటల్లో చెప్పకుండా ఆచరణలో చేసి చూపించారు.. చూపిస్తున్నారు ప్రశాంత్ మద్దుల. లస్మక్కపల్లి గ్రామ పరిధిలో ప్రజల కోసం ఇటీవల సీజనల్ డిసీజెస్ నేపథ్యంలో ‘ఉచిత వైద్య శిబిరం’ ఏర్పాటు చేశారు. సుమారు 200 మందికి పైగా గ్రామస్తులు ఈ హెల్త్ క్యాంపులో పాల్గొన్నారు. ‘ఆదిత్య ఆస్పత్రి’ వారి సహకారంతో గ్రామస్తుల కోసం హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి సక్సెస్ చేసిన ప్రశాంత్‌ను ఊరి ప్రజలు అభినందిస్తు్న్నారు.
సమస్యలపై ‘గళం’ వినిపిస్తూనే.. పరిష్కారానికి తన వంతు కృషి
మద్దుల ప్రశాంత్ తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తన శక్తి మేరకు కొన్ని పనులు సైతం చేస్తుండటం విశేషం. లస్మక్కపల్లి చెక్ డ్యామ్ కు మరమ్మతులు చేసి..నీటి వృథాను అరికట్టాలని ప్రశాంత్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. వర్షాల నేపథ్యంలో దారికి అడ్డుగా ఉన్న భారీ చెట్లు తొలగించేందుకు ప్రశాంత్ ముందుకొచ్చి.. తన సొంత ఖర్చుతో వాటిని క్లియర్ చేశారు. లస్మక్కపల్లి-నర్సింగాపూర్ ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు రోడ్డుకు ఆనుకుని ఇబ్బందికరంగా మారిన క్రమంలో..ప్రశాంత్ జేసీబీ సాయంతో వాటిని తొలగించారు. ప్రధాన రహదారిపై రోడ్డు బురదమయంగా మారడంతో..మొరం పోయించారు. స్వయంగా ఆయనే పారతో మొరం చదును చేసి రోడ్డు బాగు చేశారు. రెండు పదుల వయసులోనే నలుగురికి ఉపయగోపడే పనులు చేస్తూ ‘సేవా మార్గంలో ప్రశాంత్’ ముందుకు సాగుతుండటం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆయన్ను అభినందిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ నాయకుడిగా పలు విషయాలను హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ దృష్టికి తీసుకెళ్తూనే.. పలు పనులు ఆయన శక్తి మేరకు ప్రశాంత్ చేస్తుండటం అభినందనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజా సమస్యలనుగుర్తిస్తూ..పరిష్కారానికి ముందుకు సాగుతున్న ప్రశాంత్..
భవిష్యత్తులో యువనాయకుడిగా మరింత ముందుకు సాగాలని, ఉన్నతస్థాయికి ఎదగాలని ఊరి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.